
నల్లగొండ జిల్లా ముఖ్య నేత అంతర్మథనం
సాక్షి, హైదరాబాద్: ఆయన హోదా పెద్దది... ఆయన కూర్చునే సభ కూడా పెద్దదే... గవర్నర్, ముఖ్యమంత్రి తర్వాత రాజకీయ ప్రొటోకాల్ ఆయనదే. అటు హోదా, ఇటు ప్రొటోకాల్ ఒకదాని మించి మరోటి పెద్దవైనా నల్లగొండ జిల్లాకు చెందిన ఆ ముఖ్య నాయకుడికి మాత్రం ప్రతీసారి ప్రొటోకాల్ సమస్య ఎదురవుతోంది. జిల్లా రాజకీయాల్లో ప్రముఖుడిగా గుర్తింపు పొంది రాష్ట్ర స్థాయి పదవిని నిర్వహిస్తున్న ఆ ముఖ్యనేతకు జిల్లాలో జరిగే ప్రజా కార్యక్రమాల్లో లభించాల్సిన మర్యాద మాత్రం ఆమడదూరంలోనే నిలిచిపోతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనూ, ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ ఆయన ప్రొటోకాల్ సమస్యకు స్థానిక రాజకీయాలే కారణమని, అప్పుడయినా, ఇప్పుడయినా జిల్లా మంత్రుల వైఖరితోనే ఆ ‘పెద్దాయన’మనస్తాపం చెందుతున్నారని అటు జిల్లా, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఉపాధి ‘హామీ’కి కూడా లేని ‘గ్యారంటీ’
ప్రొటోకాల్ మర్యాద దూరమైన ఈ నల్లగొండ ముఖ్య నేతకు ఉపాధి హామీ పనుల విషయంలోనూ రాజకీయ చుక్కెదురైంది. గతంలో రూ.4 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులను తన ఎమ్మెల్సీ కోటాలో ఆయన ప్రతిపాదించారు. జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుమతించారు. సంబంధిత మంత్రి సీతక్క కూడా మంజూరు చేశారు. జిల్లా ఇంచార్జి మంత్రి పేషీ నుంచి జిల్లా కలెక్టర్‌కు మంజూరు పత్రాలు వెళ్లాయి. కలెక్టర్ వెంటనే ఈ ప్రతిపాదనల మేరకు పనుల ఆర్డర్‌కు సంబంధించిన కాపీని కూడా అందజేశారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అంతలోనే ఏమైందో కానీ వర్క్ ఆర్డర్లు రద్దయ్యాయి.
కలెక్టర్ నుంచి ఉత్తర్వులు మారిపోయి పెద్దాయన ప్రతిపాదించిన పనుల స్థానే వేరే పనులు ప్రతిపాదించారు. దీనిపై ఆయనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మనస్తాపం చెందిన ఆయన అసెంబ్లీ కార్యదర్శి ద్వారా సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వగా.. రాజకీయ జోక్యం కారణంగానే పనులను మార్చాల్సి వచ్చిందని కలెక్టర్ వివరణ ఇచ్చారు. ఇది పునరావృతం కానివ్వబోమని హామీ ఇచ్చారు. ఈ ఉపాధి పనుల కథ మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు ప్రొటోకాల్ సమస్య వచ్చిపడింది. గత నెల 28న నల్లగొండ జిల్లా కేంద్రంలో లిఫ్టు ఇరిగేషన్ పథకాల ప్రారంభం, కలెక్టరేట్‌లో నూతన భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగాయి. ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైన ఈ కార్యక్రమానికి పెద్దాయనకు పిలుపు రాలేదు.
సీఎం గారూ... చూడండి
జిల్లాలో జరిగే అధికారిక కార్యక్రమాలకు అటు మంత్రి, ఇటు కలెక్టర్ పిలవడం లేదని పెద్దాయన సన్నిహితుల వద్ద వాపోయారు. నల్లగొండలో మీడియాతో చిట్‌చాట్ పెట్టి మరీ తన ఆవేదనను వెలిబుచ్చారు. తనకు ప్రతిసారీ ప్రొటోకాల్ సమస్య వస్తోందని, ప్రభుత్వం మారినా ఈ సమస్య మారలేదన్నారు. తన విషయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన గురించి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన సందర్భంలో పెద్దాయన వివరించారని, అలా జరగకుండా చూడాలని కోరినట్టు సమాచారం. ఇందుకు స్పందించిన సీఎం దీనిపై కచ్చితంగా మాట్లాడతానని, భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకుండా చూస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం.