ఎక్కడి నుంచో రేగు పండ్ల వాసన.. ఆధునిక, వైజ్ఞానిక మేళవింపు

Thagulla Gopal won the Yuva Puraskar for 2021 For Dandakadiyam - Sakshi

తగుళ్ల గోపాల్‌ ప్రతిభకు పురస్కారం

సాక్షి, మాడ్గుల: తగుళ్ల ఎల్లమ్మ, కృష్ణయ్య దంపతుల కుమారుడు తగుళ్ల గోపాల్‌ ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా  పని చేస్తున్నారు. ఎంఏ తెలుగు పూర్తి చేసి పరిశోధన ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన రాసిన ‘దండ కడియం’ కవితా సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్‌కు ఎంపిక కావడంతో అటు స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కలకొండలో, ఇటు అజిలాపూర్‌లో హర్షం వ్యక్తమవుతోంది. ‘‘ఎక్కడి నుంచో రేగుపండ్ల వాసన.. వచ్చేది మా హంస అక్క అయి ఉంటుంది’’ అని తన కవిత్వంలో మంటల్లో చనిపోయిన అక్క హంసమ్మను బతికించుకొనే ప్రయత్నం చేశారు గోపాల్‌. ‘తీరొక్క పువ్వు’ అనే పుస్తకాన్ని కూడా రచించారు. రాష్ట్ర సాహితీ యువ పురస్కార్, మహబూబ్‌నగర్‌ సాహితీ అవార్డు, రాయలసీమ సాహితీ పురస్కార్, రొట్టెమాకురేవు  సాహితీ అవార్డు అందుకున్నారు. 

నా గ్రామమే నాకు స్ఫూర్తి 
మా ఊరు కలకొండలో నేను చవిచూసిన జ్ఞాపకాలు, పల్లెటూరి ప్రజల కష్టసుఖాలు, శ్రామికుల జీవన విధానాలే ‘దండ కడియం’ రాయడానికి స్ఫూర్తి. దండ కడియంలో ఓ పల్లెటూరి పిల్లోడి జీవనవిధానం ప్రతిబింబించేలా అక్షర రూపం ఇచ్చాను. ఇది నా ఆత్మకథ.   
 – తగుళ్ల గోపాల్‌ 

దేవరాజు ‘నేను అంటే ఎవరు’
సాక్షిప్రతినిధి, వరంగల్‌: ఆధునిక, వైజ్ఞానిక పరమైన అంశాలను ఓ తాత ఇద్దరు పిల్లలకు వివరించేదే డాక్టర్‌ దేవరాజు మహారాజు రాసిన ‘నేను అంటే ఎవరు’. ఒక తాతను పిల్లలు అడుగుతుంటే.. ‘ఆధ్యాత్మికత, దేవుడు, దయ్యం కాదు...నిన్ను నీవు తెలుసుకోడానికి నీ శరీరం జీవ కణాలతో ఎలా ఏర్పడింది ?హృదయం, మెదడు ఎలా ఏర్పడ్డాయి ? మనసు అనేది ఎక్కడా ఉండదు. అది మెదడులోనే ఒక భాగం’.. అంటూ అనేక సున్నిత, వాస్తవమైన అంశాలను ఇందులో వివరించారు. దేవరాజు 1951 ఫిబ్రవరి 21న వరంగల్‌ జిల్లా (జనగామ తాలూకా) కోడూరులో జన్మించారు.

1972లో హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ లోని ఓయూ పీజీ సెంటర్‌లో ఎమ్మెస్సీ జువాలజీ ఫస్టియర్‌ చదువుతుండగా.. ఉగాది సందర్భంగా ‘పాలు ఎర్రబడ్డాయి’అనే కవిత రాశారు. ఇది ఓ ప్రముఖ పత్రికలో ప్రచురితం కావడంతో ప్రాచు ర్యం పొందారు. తర్వాత తెలంగాణ మాండలికంలో రాసిన ‘గుండె గుడిసె’కు మంచి ఆదరణ లభించింది. భారతీయ వారసత్వం, సంస్కృతి, విజ్ఞాన నాగరికతలు డిగ్రీ పాఠ్య గ్రం థమే అయినా.. సంపాదకుడిగా దానిని ఐఏఎస్‌ స్థాయి పోటీ పరీక్షలకు పనికివచ్చే విధంగా తీర్చిదిద్దారు. రాజముద్ర, మధుశాల, నీకూ నాకూ మధ్య ఓ రంగుల నది.. ఇలా 85కి పైగా రచనలు చేశారు.  

గౌరవాలు.. 
గాయపడ్డ ఉదయం వచన కవితకు తెలుగు విశ్వవిద్యాలయ ప్రధాన అవార్డును 1991లో పొందారు. హరివంశరాయ్‌ బచ్చన్‌ కావ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌ హిందీ ఆకాడమీ వారి సౌజన్యంతో ముద్రించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉగాది సత్కారం, తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం, దాశరథి దంపతుల సత్కారం, తొలి ఎక్స్‌రే పురస్కారం, సురమౌళి అవార్డు వంటివెన్నో అందుకున్నారు. దశాబ్ద కాలంగా నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌వారికి న్యూఢిల్లీ సలహా సంఘ సభ్యులుగా ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top