కేంద్రపన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా 

Telanganas share in central taxes has increased - Sakshi

గతేడాదితో పోలిస్తే రూ.4,305 కోట్ల మేర అధికం 

ఈ ఏడాది మొత్తం రూ.21,470 కోట్ల పన్నుల కేటాయింపు 

ఐఐటీ హైదరాబాద్‌కు రూ.300 కోట్లు.. 

సింగరేణి కాలరీస్‌కు రూ.1,650 కోట్లు

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రపన్నుల్లో రాష్ట్రవాటా పెరిగింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేంద్రపన్నుల్లో భాగంగా 2023–24లో తెలంగాణకు రూ. 21,470.98 (2.102 శాతం) కోట్లు రానున్నాయి. అందులో కార్పొరేషన్‌ పన్ను రూ.6,872.08 కోట్లు, ఆదాయపు పన్ను రూ.6,685.61 కోట్లు, సంపద పన్ను రూ.–0.18 కోట్లు, సెంట్రల్‌ జీఎస్టీ రూ.6,942.66 కోట్లు, కస్టమ్స్‌ రూ.681.10 కోట్లు, కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ రూ.285.26 కోట్లు, సరీ్వస్‌ ట్యాక్స్‌ రూ.4.31 కోట్లను కేంద్రం కేటాయించింది. కాగా, గత బడ్జెట్‌లో కేంద్రపన్నుల రూ పంలో తెలంగాణకు రూ.17,165.98 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. గతేడాదితో పోలిస్తే రాష్ట్రానికి రానున్న పన్నుల వాటా రూ.4,305 కోట్లు అధికం. 

రాష్ట్ర సంస్థలకు కేటాయింపులు ఇవే... 
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్‌ ఐఐటీకి రూ.300 కోట్లు, సింగరేణి కాలరీస్‌కు రూ.1,650 కోట్లు, హైదరాబాద్‌సహా దేశంలోని 7 నైపర్‌ సంస్థలకు కలిపి రూ.550 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ సంస్థకు రూ.392.79 కోట్లు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌కు రూ.115 కోట్లు, ఇన్‌కాయిస్‌కు రూ.27 కోట్లు, హైదరాబాద్‌సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ హిందీ సంస్థకు రూ.39.77 కోట్లు, నేషనల్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు రూ.19 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధుల(పెన్షన్లు)కు రూ.653.08 కోట్లు, తెలంగాణ, ఏపీల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ.37.67 కోట్లు, హైదరాబాద్‌సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌(సీ–డాక్‌)కు రూ. 270 కోట్లు, హైదరాబాద్‌ జాతీయ పోలీసు అకాడమీసహా పోలీసు విద్య, ట్రైనింగ్, పరిశోధనలకు మొత్తం రూ.442.17 కోట్లు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎనిమల్‌ బయోటెక్నాలజీ సంస్థకు రూ.30.50 కోట్లు, మణుగూరుసహా కోట(రాజస్తాన్‌)లోని భారజల ప్లాంట్లకు రూ.1,473.43 కోట్లు, బీబీనగర్, మంగళగిరిసహా దేశంలో 22 కొత్త ఎయిమ్స్‌ నిర్మాణానికి రూ.6,835 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top