పూత నిలవలె..పిందె ఎదగలె

Telangana: Yield Of Mangoes Not Get Profit From Last Two Years - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా మా(మి)డి పోయింది..! 

దెబ్బతీసిన అధిక వర్షాలు, నల్ల తామర, తేనెమంచు పురుగులు 

ప్రస్తుతం మండిపోతున్న ఎండలతో రాలిపోతున్న పిందెలు, కాయలు 

5 లక్షల టన్నులకు పైగా దిగుబడి తగ్గిపోయే అవకాశం 

గత రెండేళ్లు దిగుబడి బాగా ఉన్నా దెబ్బకొట్టిన కరోనా 

ఈసారి ధర బాగానే ఉన్నా దిగుబడులు లేక రైతుకు నష్టం 

జగిత్యాల అగ్రికల్చర్‌/ కొల్లాపూర్‌: ఫలరాజుగా పేరుగాంచిన మామిడి గత రెండేళ్లు ఆశించిన స్థాయిలో దిగుబడులు ఇచ్చింది. కానీ కరోనా నేపథ్యంలో గిట్టుబాటు ధర రాలేదు. ఈ ఏడాది గిట్టుబాటు ధర లభిస్తున్నా.. దిగుబడులు లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అధిక వర్షాలతో పూత ఆలస్యం కావడం, అవే వర్షాలు పురుగులు, తెగుళ్లు ఆశించడానికి దోహదపడటంతో..పూత నిలవక, పిందె ఎదగక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి.

అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి 3.5 టన్నుల చొప్పున రావాల్సిన దిగుబడి.. ప్రస్తుతం 1 నుంచి 1.5 టన్నుకు తగ్గిపోయే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మామిడి పండ్లకు ప్రసిద్ధి చెందిన ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్‌లో సైతం దిగుబడి 60 శాతం తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు 
తెలంగాణ రాష్ట్రంలో 3.17 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. జగిత్యాల, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మామిడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే నేలల రకాన్ని బట్టి ఎకరానికి 3.5 టన్నుల చొప్పున 11.10 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని ఉద్యానశాఖ అధికారుల తొలుత అంచనా వేశారు. ఎర్రనేలల్లో ఎకరాకు 4 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని భావించారు. 

అధిక వర్షాలతో తేమ ఆరక.. 
అయితే మామిడి దిగుబడిపై ఈ ఏడాది అధిక వర్షాలు ప్రభావం చూపాయి. సాధారణంగా జూన్, జూలైలోనే వర్షాలు ప్రారంభమై, ఆగస్టు, సెప్టెంబర్‌ వరకు కురుస్తాయి. కానీ గత ఏడాది నవంబర్‌ చివరివరకూ అధిక వర్షాలు కురిశాయి. దీంతో నేలల్లో తేమ శాతం పెరిగింది. తేమ ఆరక,  చెట్టుకు పూత రాకుండా కొమ్మలు చిగురించాయి.

సాధారణంగా డిసెంబర్, జనవరిలో రావాల్సిన పూత ఆలస్యమైంది. తర్వాత ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి..ఇలా నాలుగు దఫాలుగా పూత కాసింది. దీంతో కొన్నిచోట్ల పూత ఉంటే, కొన్నిచోట్ల పిందెలు వచ్చాయి. కొన్నిచోట్ల కాయ దశకు చేరుకున్నాయి. 

రసం పీల్చిన పురుగులు 
అధిక వర్షాలతో దున్నడం, ఎండిన కొమ్మలను తొలగించడం వంటి పనులకు ఆటంకం ఏర్పడింది. దీంతో నల్ల తామర, తేనెమంచు పురుగులు పంట కాలానికి ముందు చెట్టు కాండం, కొమ్మల బెరడులో దాక్కుని పూత, పిందె సమయంలో చెట్టు పైకి వచ్చి నష్టం చేశాయి. పురుగులు గుంపులుగా చేరి పూలు, పిందెల నుంచి రసం పీల్చాయి. దీంతో పూత రాలిపోయింది. నల్ల తామర పురుగులు పిందెల దశలో చర్మాన్ని గోకి రసం పీల్చి నష్టం కలిగించాయి. 

తగ్గనున్న దిగుబడులు.. 
పురుగులు, తెగుళ్లకు తోడు పోషకాల లోపంతో ఈ ఏడాది మామిడి దిగుబడి ఎకరాకి టన్ను నుంచి 1.5 టన్నుల వరకు పడిపోయే అవకాశం ఉందని ఉద్యాన అధికారులు అంటున్నారు. రాష్ట్రం మొత్తం మీద  5–6 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. కొద్దిరోజులుగా 41– 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉన్న పిందెలు, కాయలు కూడా రాలిపోతున్నాయి.  

కొల్లాపూర్‌ మామిడికీ కరువే ఉమ్మడి జిల్లాలో భారీగా తగ్గిన దిగుబడులు
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్‌ మామిడి పండ్లకు బాగా ప్రసిద్ధి. అందులోనూ బేనీషాన్‌ రకం పండ్లకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ పండించే మామిడి పండ్లను దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తారు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన కొల్లాపూర్‌ మామిడి పండ్లకు ఈసారి కరువొచ్చే పరిస్థితి ఏర్పడింది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి భారీగా తగ్గిపోయింది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 60 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వీటిలో కొల్లాపూర్‌ నియోజకవర్గంలోనే అత్యధికంగా 37,670 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చిన్నరసాలు, పెద్దరసాలు, దెసేరీ, నీలిషాన్‌ తదితరాలతో పాటు ప్రధానంగా బేనీషాన్‌ రకం మామిడిని రైతులు పండిస్తుంటారు. అయితే ఈసారి 60 శాతం తోటల్లో జనవరి చివర్లో, ఫిబ్రవరి మొదటి వారంలో పూత వచ్చింది. ఇదే సమయంలో వర్షాలు పడడంతో పూతను దెబ్బతీసింది. దీనికితోడు గతంలో ఎన్నడూ లేని విధంగా మిర్చి పంటకు సోకే నల్ల తామర పురుగు మామిడి పంటకు సోకి దిగుబడిపై ప్రభావం చూపింది. ఉద్యాన శాఖ అధికారుల అంచనాల ప్రకారం కేవలం 40 శాతం తోటల్లోనే మామిడి కాపు కాసింది. 

టన్ను ధర లక్ష పైచిలుకే.. 
పంట దిగుబడి బాగా తగ్గడంతో ఈసారి మామిడి కొనుగోళ్లకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. హైదరాబాద్, ముంబై వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి మామిడి కాయలు కొనుగోలు చేస్తున్నారు. కేజీ రూ.100 నుంచి రూ.120 దాకా చెల్లిస్తున్నారు. అంటే దాదాపుగా టన్ను ధర రూ.లక్ష పైచిలుకు పలుకుతోంది.

పెట్టుబడి కూడా వచ్చేట్టు లేదు  
నాకు ఐదు ఎకరాల మామిడి తోట ఉంది. ఎకరాకి రూ.50 వేల చొప్పున పెట్టుబడి పెట్టిన. రెండు, మూడుసార్లు రసాయన మందులు చల్లినా పూత నిలువలేదు. పిందె ఎదగలేదు. కాయలను చూస్తే.. పెట్టుబడి కూడా వచ్చేట్టు కనిపించడం లేదు. 
– పడిగెల రవీందర్‌రెడ్డి, రాయికల్, జగిత్యాల జిల్లా 

తేనె మంచుతో రాలిన పూత 
సాధారణంగా నవంబర్‌ నెలాఖరులో, డిసెంబర్‌లో మామిడిపూత ప్రారంభం కావాలి. కానీ ఆలస్యంగా ప్రారంభమైన పూత ఈ ఏడాది మార్చి వరకు వస్తూనే ఉంది. ఆ సమయంలోనే తేనె మంచు ఆశించింది. పూత రాలిపోయింది. 
 – ప్రతాప్‌సింగ్, జిల్లా ఉద్యాన అధికారి, జగిత్యాల 

ఒక్క కాయ కూడా తెంచలేదు 
సొంత భూమి 30 ఎకరాలతో పాటు మరో 30 ఎకరాల మామిడి తోట కౌలు కు తీసుకున్నా. రూ.35 లక్షలు ఖర్చు చేశా. తెగుళ్లు, వాతావరణ మార్పులతో ఒక్క తోటలోనూ పూత నిలబడ లేదు. ఇప్పటివరకు ఒక్క కాయ కూడా తెంచలేదు.    
– పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్‌ 

అధికారులకు నివేదించాం.. 
మామిడి దిగుబడి ఈసారి 60 శాతం తగ్గింది. సకా లంలో పూత రాకపోవడం,  ఉష్ణోగ్రతలు పెరగడం, నల్ల తామర తెగులు సోక డంతో పంట దిగుబడి తగ్గింది. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. పంటనష్టం, దిగుబడి వివరాలను అధికారులకు చెప్పాం. 
– లక్ష్మణ్, ఉద్యానవన అధికారి, కొల్లాపూర్‌  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top