70 లేఖలు రాసినా స్పందన లేదు!

Telangana Writes 70 Letters But Krishna Board Has Not Responded - Sakshi

కృష్ణా బోర్డు తీరు పట్ల తెలంగాణ అసంతృప్తి 

ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి 

క్యారీ ఓవర్‌ నీళ్లను మరుసటి ఏడాది లెక్కించొద్దు 

కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను కోతపెట్టాలి 

లేఖలో మళ్లీ డిమాండ్‌ చేసిన తెలంగాణ 

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పులోని పలు అంశాల అమలు కోరుతూ 70కి పైగా లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలేదంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ లేఖలపై ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. గతంలో రాసిన 70 లేఖల జాబితాతో పాటు ఆ లేఖల్లోని ముఖ్యాంశాలను తాజాగా రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ నెల 24న కృష్ణా బోర్డు నిర్వహించనున్న రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ(ఆర్‌ఎంసీ) సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో బోర్డు అధికారులను ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా తెలంగాణ ఈ లేఖను రాయడం విశేషం. 

వివరాలివీ...
 రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 85(8ఏ) ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పుతో పాటు అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలు తప్పనిసరి అని గుర్తు చేశారు. 20% జలాలను తాగునీటికి వినియోగించాలని కృష్ణా ట్రిబ్యునల్‌–1 పేర్కొనగా, నీటి లెక్కల్లో దీన్ని కృష్ణా బోర్డు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలంగాణ తప్పుబట్టింది.  
► వాడుకోని వాటా జలాలను తెలంగాణ మరుసటి జల సంవత్సరానికి బదలాయింపు(క్యారీ ఓవర్‌) చేస్తుండగా, ఈ జలాలను మరుసటి ఏడాది తెలంగాణ వాటా జలాల కింద లెక్కించవద్దని చేస్తున్న విజ్ఞప్తులను కృష్ణా బోర్డు పట్టించుకోవడం లేదు. కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పులోని స్కీం–ఏ కేటాయింపుల కింద ‘క్యారీ ఓవర్‌’జలాలను మరుసటి సంవత్సరం వాడుకోవచ్చు.  
 ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక కేటాయింపులను తెలంగాణ రాష్ట్రం ఇకపై ఏ మాత్రం అంగీకరించ దు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70శాతం హ క్కులున్నప్పటికీ 50:50 నిష్పత్తిలో తాత్కాలిక కే టాయింపులు జరపాలని ఎన్నో లేఖలు రాశాం.  
 శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల నిర్వహణకు విధివిధానాల(రూల్‌కర్వ్‌)రూపకల్పనలో సీడబ్ల్యూసీ వినియోగించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేఆర్‌ఎంబీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. శ్రీశైలం జలాశయంలో వాటాదారుడిగా రూల్‌కర్వ్‌ పరిశీలనల కోసం ఈ సమాచారం మాకు అవసరం. చెన్నై వాటర్‌ సప్లై ఒప్పందాల ప్రకారం..కేవలం 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో గల కాల్వ ద్వారా 15 టీఎంసీలను మాత్రమే తరలించడానికి హెడ్‌వర్క్స్‌ నిర్మించాలి, ఈ నిబంధన అమలుకు కేంద్రం తనిఖీలు జరపాల్సి ఉంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారం కూడా కావాలి. ఈ నిబంధన మేరకు రూల్‌కర్వ్‌ను సవరించాలి.  
 గోదావరి ట్రిబ్యునల్‌ ఒప్పందంతో పాటు పోల వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతు లప్రకారం.. నాగార్జునసాగర్‌ నుంచి కృష్ణా డెల్టా సిస్టం వాటాలో 80 టీఎంసీలను తగ్గించాలి. దీనికి విరుద్ధంగా సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌కర్వ్‌లో నాగార్జునసాగర్‌నుంచి కృష్ణా డెల్టా సిస్టంకు జరిపిన కేటాయింపులను తొలగించాలి. 
► బేసిన్‌ లోపలి ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా శ్రీశైలంలో 76:24 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు విద్యుదుత్పత్తి చేసుకునేందుకు వీలుకల్పించేలా రూల్‌కర్వ్‌ను సవరించాలి. తెలంగాణ పరిధిలోని బేసిన్‌ లోపలి ప్రాంతాల అవసరాలకు 160 టీఎంసీలను కేటాయించడంతో పాటు శ్రీశైలం నుంచి బేసిన్‌ వెలుపలి అవసరాలకు ఏపీ చేస్తున్న తరలింపులను 34 టీఎంసీలకు పరిమితం చేసేలా రూల్‌కర్వ్‌ను సవరించాలి.  
 పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌తో అనుసంధానమై ఉన్న అన్ని కాల్వలకు రియల్‌ టైం డేటా అక్విసైషన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి నీటి తరలింపులను కచ్చితంగా లెక్కించాలి. శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునికీకరణ జరపాలి.

ఇదీ చదవండి: అదేమో గానీ.. పార్టీని మాత్రం ఎవరూ కాపాడలేరు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top