బీజేపీ నియంతృత్వాన్ని ఉద్యమంలా తీసుకెళ్తోంది

Telangana: Writer Arundhati Roy About BJP Govt - Sakshi

ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌

సుందరయ్య విజ్ఞానకేంద్రం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతృత్వాన్ని కూడా ప్రత్యేక ఉద్యమంలా తీసుకువెళ్తోందని ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌ ఆరోపించారు. మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకుడు కె.బాలగోపాల్‌ 13వ స్మారకోపన్యాసాన్ని ఆదివారం సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. వేదిక కార్యదర్శి డాక్టర్‌ తిరుపతయ్య, సుధ అధ్యక్షతన జరిగిన ఈ సభకు అరుంధతీరాయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... దేశంలో కార్పొరేట్‌ శక్తులను కాపాడేందుకు నియంతృత్వ వి«ధానాలకు కులమతాలను జోడిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పరోక్ష భాగస్వామి కావడం వల్లే 8ఏళ్లలోనే అదానీ 8 బిలియన్‌ డాలర్లనుంచి 139 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో ప్రపంచంలోనే సంపన్నుడిగా ఎదిగాడన్నారు. భవిష్యత్‌లో ఇదే వరుసలో అమిత్‌షా కుమారుడు కూడా రానున్నాడని చెప్పారు.

అదానీని ప్రభుత్వానికి చెందిన వ్యక్తిగా ఫోకస్‌ చేయడం కోసమే 2014లో మోదీ.. అదానీ విమానంలో వచ్చి ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశంలో బీఎండబ్ల్యూకి, ఎడ్లబండికి పోటీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. సామాజిక, విప్లవ శక్తులు మరింత ఎక్కువగా ప్రజల మధ్య పనిచేయాలని ఆకాంక్షించారు. ముస్లిం మహిళలను మరింత అణచివేసేందుకే హిజాబ్‌ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.

ఆలిండియా సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌ జాతీయ కార్యదర్శి క్లిఫ్‌టన్‌ డి రాజోరియో మాట్లాడుతూ... మోదీ ఫాసిజానికి ఫేస్‌లాంటి వాడన్నారు. ఆయన ప్రధాని అయ్యాక దేశంలో కార్మికుల హక్కులు మరింతగా అణచివేతకు గురవుతున్నాయన్నారు. కార్యక్రమంలో పీయూసీఎల్‌ నాయకులు నిహిర్‌ దేశాయ్, హెచ్‌ఆర్‌ఎఫ్‌ నాయకులు జహా ఆరా, మానవ హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ జీవన్‌ కుమార్, తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల్‌ రచించిన ‘కోర్టు తీర్పులు – సామాజిక న్యాయం’ అనే పుస్తకాన్ని అరుంధతీరాయ్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top