ప్రతిష్టాత్మకంగా జన సమీకరణ 

Telangana: TRS Arrangements For Munugodu Sabha - Sakshi

రేపు మునుగోడు సభ కోసం టీఆర్‌ఎస్‌ ముమ్మర ఏర్పాట్లు 

21న బీజేపీ సభను దృష్టిలో పెట్టుకొని భారీ జనసమీకరణ.. 

సభ తర్వాత పార్టీ ఇన్‌చార్జీలు, నేతలతో భేటీ కానున్న కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక దిశగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్న టీఆర్‌ఎస్‌... నియోజకవర్గ కేంద్రంలో శనివారం భారీ బహిరంగ సభ నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు హాజరవుతుండటంతో జనసమీకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సభ నిర్వహణ కోసం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలవారీగా ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు.

టీఎస్‌ఐఐసీ చైర్మన్‌ గ్యాదరి బాలమల్లు మునుగోడులో మకాం వేసి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు భారీ జనసమీకరణ కోసం కసరత్తు చేస్తున్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, క్రియాశీల నాయకులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి గ్రామాలు, వార్డులవారీగా జనసమీకరణపై దిశానిర్దేశం చేశారు.

టీఆర్‌ఎస్‌ సభ మర్నాడే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సైతం మునుగోడులో బీజేపీ బహిరంగ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్‌కు ఇటీవల రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ సభ ద్వారానే బీజేపీలో చేరనున్న నేపథ్యంలో బీజేపీ సభను దృష్టిలో పెట్టుకొని జనసమీరణను టీఆర్‌ఎస్‌ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. 

టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న చేరికలు 
మునుగోడు సభకు జనసమీకరణపై దృష్టి పెడుతూనే మరోవైపు కాంగ్రెస్‌ నుంచి చేరికలను టీఆర్‌ఎస్‌ ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ మద్దతుదారులైన 20 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరారు. శనివారం మనుగోడు సభలో సీఎం సమక్షంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మునుగోడు సభ తర్వాత కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ స్థానిక ప్రజాప్రతినిధులు, కీలక నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశముంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top