చేపపిల్లలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయాలి:  మంత్రి తలసాని 

Telangana: Talasani Srinivas Yadav Comments On Free Fish Baby Distribution - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉచిత చేప పిల్లల పంపిణీకి అవసరమైన చేపపిల్లలను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసే అంశంపై దృష్టి సారించాలని పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల విక్రయ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణను రూపొందించాలని సూచించారు.

గొర్రెలు, మేకల ఫెడరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఆధార్‌ సిన్హాతో కలిసి సోమవారం మత్స్య భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ రాంచందర్, మత్స్యశాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, టీఎస్‌ఎల్‌డీఏ సీఈవో మంజువాణి, వెటర్నరీ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వీరోజీ పాల్గొన్న సమావేశంలో... మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలను పీపీపీ పద్ధతిలో మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేసి, నివేదిక అందజేయాలని సూచించారు.

రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల్లో మత్స్యశాఖ కార్యక్రమాల నిర్వహణ కోసం అనువైన 159 ఎకరాల భూమిని గుర్తించామని, అందులో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ.4,563 కోట్ల ఎన్‌సీడీసీ రుణం మంజూరైందని, చనిపోయిన గొర్రెల బీమా అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లాల్లో గొర్రెల మార్కెట్‌ కోసం భూమి కేటాయింపు, నిధుల మంజూరు జరిగినా పనులు జరగడం లేదని, వెంటనే పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశు వైద్యశాలల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top