అసలే వర్షాకాలం.. లొట్టలేసుకుని పానీపూరి తింటున్నారా?.. జాగ్రత్త!

Telangana: Street Food Pani Puri Is Causing Health Issues Typhoid - Sakshi

సాక్షి, మెదక్‌: చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందరూ పానీపూరిని ఇష్టపడతారు. స్పైసీగా ఉండటంతో దీన్ని తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే చాలా బండ్ల యజమానులు కలుషిత నీటిని వినియోగిస్తుండటంతో ప్రజలు టైఫాయిడ్, ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతూ విషజ్వరాలతో మంచం ఎక్కుతున్నారు. పట్టణాలు, గ్రామాల్లో వెలసిన పానీపూరి బండ్లపై అధికారుల తనిఖీలు లేకపోవడంతో యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు టైఫాయిడ్‌ వంటి జ్వరాలు వస్తుండటంతో పలువురు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. వర్షాకాలంలో పానీపూరీ తినవద్దని గతంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాస్‌ ప్రకటన ఇవ్వడంతో అందరి దృష్టి పానీపూరిపై పడింది.  

ఊసేలేని అధికారుల తనిఖీలు
►ఆహారభద్రత చట్టం కింద జిల్లాలో ఫుడ్‌ సేప్టీ అధికారులు హోటళ్లు, ఇతర తినుబండారాలు అందించే ఏ దుకాణాన్ని అయినా తనిఖీ చేసే అధికారం ఉంది. పురపాలికల్లో వైద్యాధికారులు, గ్రామాల్లో పంచాయతీ అధికారులు తనిఖీ చేయొచ్చు. పెద్దపెద్ద హోటళ్లపై అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు చేస్తున్నప్పటికీ తోపుడు బండ్లపై తనిఖీలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు.  
►సిబ్బంది కొరత.. చిరు వ్యాపారుల పొట్టగొట్టడం ఎందుకన్న మానవతా దృక్పథంతో అధికారులు పానీపూరీ, చాట్‌ బండారాల దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో పలు దుకాణాల వారు, తోపుడు బండ్ల వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు.  
►జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఫుడ్‌ సేప్టీ అధికారులు పానీపూరి బండ్లతో పాటు వీధుల్లో తినుబండారాల దుకాణాల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. 

అప్రమత్తంగా ఉండాలి 
యువత, చిన్నపిల్లలకు పానీపూరీ తినడం పెద్ద ఫ్యాషన్‌ అయిపోయింది. దుకాణం వద్ద అపరిశుభ్రంగా ఉన్నా రోజూ సాయంత్రం తినడం రివాజుగా మారింది. వర్షాకాలంలో పానీపూరి తినకపోవడమే మంచిది. యజమానులు షాపుల వద్ద పరిశుభ్రంగా ఉంచాలి. శుద్ధమైన నీటినే వినియోగించాలి. ప్రజలు సైతం వారి ఆరోగ్యంపై వారే బాధ్యత తీసుకొని మెలగాలి.  
– సత్యనారాయణ, ఆస్పత్రి సూపరింటెండెంట్, సదాశివపేట 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top