రాష్ట్రానికి మరిన్ని టీకాలు

Telangana state is likely to get more vaccines - Sakshi

కేంద్ర ప్రభుత్వ తాజా ఆదేశాలతో మార్గం సుగమం 

ఇతర రాష్ట్రాల ‘ప్రైవేట్‌ టీకాలు’ కొనుగోలు చేసే యోచనలో వైద్యఆరోగ్య శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి మరిన్ని టీకాలు వచ్చే అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఇందుకు మార్గంసుగమం చేసింది. రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసే కరోనా టీకాల్లో 75 శాతం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు, 25 శాతం ప్రైవేట్‌ ఆసుపత్రులకు అందజేస్తుంది. అయితే ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్‌ ఆసుపత్రులు చాలా తక్కువగా ఉన్నాయి. మరికొన్ని చోట్ల ప్రైవేట్‌ ఆసుపత్రులు వ్యాక్సిన్లు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రైవేట్‌ ఆసుపత్రుల నిమిత్తం కేటాయించిన టీకా డోసులు మిగిలిపోతున్నాయి. ఈ విధంగా మిగిలిన టీకాలను, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని, ఆయా రాష్ట్రాల్లో మిగిలిపోతున్న ప్రైవేట్‌ టీకా డోసులు కొనుగోలు చేసే ఆలోచనలో రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉంది. 

టీకాల కోసం ఎదురుచూపులు 
తెలంగాణకు కేంద్రం ఇప్పటివరకు 1.20 కోట్లకు పైగా టీకాలను సరఫరా చేసింది. జూలై నెలకు మరో 28 లక్షలు కేటాయించింది. అయితే కరోనా నేపథ్యంలో చాలామంది అర్హు లు ఇంకా టీకాల కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు దాదాపు రెండు లక్షల డోసులు వేస్తున్నా కొరత వేధిస్తూనే ఉంది. కొన్ని టీకా కేంద్రాల్లో డోసులు అసలే దొరకడం లేదు. దీంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేం ద్రం.. జనాభా, కరోనా కేసుల ప్రాతిపదికన ఇస్తుండటంతో డిమాండ్‌ మేరకు రాష్ట్రానికి వ్యాక్సిన్లు సరఫరా కావడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి ఉపకరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంటున్నా రు. ఇతర రాష్ట్రాల నుంచి టీకాలు కొనడం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలుపడుతుందని చెబుతున్నారు. నెలకు అదనంగా మరో ఐదారు లక్షల టీకాలకు వీలు పడుతుందని పేర్కొంటున్నారు.  

టీకాల షెడ్యూల్‌కు కసరత్తు 
రాష్ట్రంలో ప్రస్తుతం వెయ్యికి పైగా ప్రభుత్వ, ప్రైవేట్‌ కేంద్రాల్లో టీకాలు వేస్తున్నారు. అయితే ఒక్కోరోజు కొన్ని కేంద్రాల్లో టీకాల కార్యక్రమా న్ని అకస్మికంగా నిలిపివేస్తున్నారు. టీకాల కొరత, కొన్నిసార్లు ఇతర కేంద్రాలకు ఎక్కువగా పంపడం వంటి కారణాలతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఇలాం టి పరిస్థితిని నివారించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం ఏ నెలలో ఎన్ని టీకాలు రాష్ట్రాలకు పంపాలో ఇప్పటికే నిర్ణయించి షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ ప్రకారమే రాష్ట్రాలు కూడా ప్రణాళిక రచించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. జిల్లాలు మొదలు టీకా కేంద్రాల వారీగా షెడ్యూల్‌ ఖరారు చేసి సరఫరా చేయాలని ఆదేశించింది. ఇలా చేయడం వల్ల ఏ టీకా కేంద్రానికి, ఏ రోజు, ఎన్ని డోసులు సరఫరా అవుతాయో స్పష్టత ఉంటుంది. దీనివల్ల లబ్ధిదారులకు కూడా ఎలాంటి ఇబ్బందీ కలగదు. కేంద్రం ఆదేశాల మేరకు షెడ్యూల్‌ ఖరారుకు కసరత్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

15 నుంచి దేశంలో మోడెర్నా టీకా 
ప్రపంచంలో పేరుపొందిన టీకాల్లో ఒకటైన మోడెర్నా ఈ నెల 15వ తేదీ నుంచి దేశంలో అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో ఈ టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా స్పష్టత రాలేదని చెబుతున్నారు. మోడెర్నా టీకాను  ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలోనూ అందుబాటులోకి తెస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా వేస్తామని అధికారులు చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top