ముస్లిం సోదరులకు తెలంగాణ సర్కారు ప్రత్యేక కానుకలు..

Telangana State Govt To Distribute Ramadan Gift Pack Among Poor Muslims - Sakshi

జిల్లాకు చేరిన ఆరు వేల ప్యాక్‌లు

త్వరలోనే నియోజకవర్గాల వారీగా పంపిణీ

ఏర్పాట్లు చేస్తున్న మైనారిటీ సంక్షేమ శాఖ

సాక్షి, నిర్మల్‌: రంజాన్‌ పండుగ పురస్కరించుకుని ముస్లిం కుటుంబాలకు గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సరఫరా చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే కోవిడ్‌ నిబంధనల ప్రకారం పంపిణీకి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.  

జిల్లాకు 6 వేలు గిఫ్ట్‌ప్యాక్‌లు..
పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు తెలంగాణ సర్కారు ఏటా గిఫ్ట్‌ప్యాక్‌లు అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాకు 6వేల వరకు వచ్చాయి. వీటిని నియోజకవర్గాల వారీగా పంపణీకి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్‌ నియోజకవర్గానికి 2వేలు, ము థోల్‌ నియోజకవర్గానికి 2500, ఖానాపూర్‌ నియోజ కవర్గానికి 1500 చొప్పున కేటాయించారు. మసీదుల వారీగా అర్హులైన కుటుంబాలను ఎంపిక చేసి అందజేయనున్నారు. పంపిణీకి ఇబ్బందులు ఏర్పడకుండా ఇప్పటికే నియోజకవర్గ కేంద్రంలోని తహసీల్దార్లను ప్రత్యేక అధికారులుగా, మిగతా మండలాల తహసీల్దార్లను ఆయా మండలాల ఇన్‌చార్జీలుగా నియమించారు. వీరు స్థానిక ప్రజాప్రతినిధుల సమన్వయంతో అర్హులైన వారికి పంపిణీ చేస్తారు. 

ఇఫ్తార్‌ విందు రద్దు..
ఏటా రంజాన్‌ సందర్భంగా డ్రెస్‌ మెటీరియల్, చీర, కుర్తా పైజామాకు సంబంధించిన దుస్తులతో కూడిన గిఫ్ట్‌ప్యాక్‌లు అందించడంతో పాటు ఇఫ్తార్‌ విందు కూడా ఘనంగా ఇచ్చేవారు. అయితే కోవిడ్‌ కారణంగా గతేడాది ఇఫ్తార్‌ విందు రద్దు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

నిబంధనలు పాటిస్తూ గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీ..
రంజాన్‌ సందర్భంగా జిల్లాకు 6వేల గిఫ్ట్‌ప్యాక్‌లు వచ్చాయి. త్వరలోనే వీటిని కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తహసీల్దార్లు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అర్హులైన వారికి పంపిణీ     చేయనున్నాం. 

– స్రవంతి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, నిర్మల్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top