సింగరేణిలో తొలి ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ప్రారంభం

Telangana: Singareni 5MW Floating Solar Plant Becomes Operational - Sakshi

మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని ఎస్టీపీపీ జలాశయంలో ఏర్పాటు 

5 మెగావాట్ల ప్లాంట్‌లో తొలిసారిగా దేశీయ టెక్నాలజీ, సోలార్‌ పలకల వినియోగం

గ్రిడ్‌కు అనుసంధానం చేసిన సింగరేణి డైరెక్టర్‌ సత్యనారాయణరావు 

త్వరలో మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ సిద్ధం

జైపూర్‌ (చెన్నూర్‌)/ సాక్షి, హైదరాబాద్‌: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ (ఎస్టీపీపీ) కేంద్రానికి సంబంధించిన జలాశయంపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను శనివారం ప్రారంభించారు. సింగరేణి సంస్థ డైరెక్టర్‌ డి.సత్యనారాయణరావు ఈ ప్లాంట్‌ను ప్రారంభించి తెలంగాణ ట్రాన్స్‌కో గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. దీంతో సింగరేణి సంస్థ సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 224 మెగావాట్లకు చేరింది.

ఈ సందర్భంగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఉద్యోగులు, అధికారులను అభినందించారు. ఇక్కడే ఏర్పాటు చేస్తున్న మరో 10 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, 3 దశల్లో మొత్తం 300 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు కు సింగరేణి సంస్థ మూడేళ్ల కార్యాచరణ ప్రారంభించింది. మొదటి రెండు దశల్లో 219 మెగావాట్ల సామర్థ్యం గల 8 ప్లాంట్లను మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు, రామగుండం–3, మందమర్రి ఏరియాల్లో నిర్మించింది.

వీటి ద్వారా 540 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కాగా, సంస్థ విద్యుత్‌ ఖర్చుల్లో రూ.300 కోట్లను సింగరేణి సంస్థ ఆదా చేసింది. మూడో దశ కింద 81 ప్లాంట్ల నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. దీనిలో భాగంగా మొత్తం 15 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లను సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్ర ప్రాంగణంలోని రెండు జలాశయాలపై నిర్మించే బాధ్యతలను నోవస్‌ గ్రీన్‌ ఎనర్జీ సిస్ట మ్స్‌ సంస్థకు అప్పగించారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీపీపీ సీటీసీ సంజయ్‌కుమార్, జీఎం డీవీఎస్‌ఎన్‌ సూర్యనారాయణ రాజు, జీఎం (సోలార్‌) జానకి రాం, ఎస్‌వోటు డైరెక్టర్‌ సూర్యకు మార్, ఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ శేషారావు, జీఎం పీసీఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏజీఎం సత్యనారాయణప్రసాద్, సీఎంవో ఏఐ కేంద్ర ఉపాధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్, టీబీజీ కేఎస్‌ ఉపా«ధ్యక్షుడు చుక్కల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top