TG: న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల స్పెషల్‌ ఫోకస్‌ | Telangana Police Special Focus On New Year Celebrations | Sakshi
Sakshi News home page

TG: న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసుల స్పెషల్‌ ఫోకస్‌

Dec 29 2024 10:53 AM | Updated on Dec 29 2024 11:04 AM

Telangana Police Special Focus On New Year Celebrations

సాక్షి, హైదరాబాద్‌: మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్‌ వేడుకలకు దేశంలోని పలు నగరాలు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఇక, ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారులలో వేడుకలు భారీ రేంజ్‌లో జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.

న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా నిఘా వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ, డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యాలను నిర్ధేశించిన నేపథ్యంలో పోలీస్ శాఖలోని అన్ని విభాగాలు న్యూ ఇయర్ వేడుకలపై ఫోకస్ చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు నగర శివారుల్లో జరిగే పార్టీలపై ప్రత్యేకంగా నిఘా పెట్టనున్నట్టు తెలుస్తోంది.

అలాగే పలు జిల్లాల్లోని ముఖ్య నగరాల్లో, ఫామ్ హౌస్‌లు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లపై పోలీస్ శాఖ ఓ కన్నేసి ఉంచింది. న్యూ ఇయర్‌ వేడుకలపై సివిల్ పోలీస్‌తో పాటు నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటి పోలీస్ విభాగాలు కూడా అలర్ట్‌ అయ్యాయి. వేడుకల్లో భాగంగా ఆకస్మిక తనిఖీలకు ప్లాన్‌ చేసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇప్పటికే హైదరాబాద్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్ , హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు. బార్లు, పబ్‌ల లైసెన్స్ తనిఖీ చేశారు.

మరోవైపు.. కొత్త ఏడాది వేడుకల్లో మైనర్లను బార్లు, పబ్‌లకు అనుమతిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. డీజేలతో హంగామా చేయవద్ధని, నిషేధానికి సహకరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సౌండ్‌ పొలుష్యన్‌కు కారణంగా కాకుండా చూసుకోవాలని పబ్ యజమానులకు ఆదేశాలిచ్చారు.

నాలుగు పబ్‌లకు అనుమతి నో...  
జూబ్లీహిల్స్‌లోని హార్ట్‌కప్, అమ్నేషియా, బ్రాడ్‌వే, బేబీలాన్‌ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వడం లే దు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పో లీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ వేదికలకు అనుమతులు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.  

సిద్ధమవుతున్న పబ్‌లు ఇవే...  
జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్‌లు ఉండగా ఇందులో నాలుగింటికి అనుమతులు నిరాకరించారు. కొన్నింట్లో మాత్రం ప్రత్యేక వేడుకలు జరగడం లేదు. అయితే న్యూ ఇయర్‌ వేడుకల కోసం దరఖాస్తు చేసుకున్న వాటిలో లుఫ్ట్, క్లబ్‌ రోగ్, పోష్‌ నాష్, తబలారసా, జోరా, లార్డ్‌ ఆఫ్‌ డ్రింక్స్, ప్రోస్ట్, జిందగీ స్కై బార్, ఫోర్జ్‌ బ్రీవ్, 040 బ్రీవ్, హలో, ఎల్యూజన్, ఎయిర్‌లైవ్, గ్రీజ్‌ మంకీ, పోర్‌ ఫాదర్స్, జైథుమ్, స్టోన్‌ వాటర్, పోయిస్ట్‌ తదితర పబ్‌లు వేడుకలకు అనుమతులు పొందాయి. యువతను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన డీజేలను రప్పిస్తున్నారు. గోవా నుంచి పేరొందిన డీజేలతో పాటు గాయనీ, గాయకులను పిలిపిస్తున్నారు. కొన్ని పబ్‌లకు బాలీవుడ్‌ తారలు కూడా వస్తుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement