సచివాలయానికి అంబేడ్కర్‌ పేరు.. సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం

Telangana New Secretariat To Be Named After Dr BR Ambedkar - Sakshi

కొత్త పార్లమెంట్‌ భవనానికీ అంబేడ్కర్‌ పేరు పెట్టాలి

దీనిపై త్వరలో ప్రధానికి లేఖ రాస్తా 

అంబేడ్కర్‌ దార్శనికతతోనే తెలంగాణ సాధ్యమైంది.. 

ఆయన ఆశయాల మేరకే రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నట్లు ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. భారత నూతన పార్లమెంటు భవనానికి సైతం అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ఆయన మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్రం ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని గత మంగళవారం రాష్ట్ర శాసనసభ ఏకగీవ్రంగా తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఏదో ఆశామాషీకి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరడం లేదని స్పష్టంచేశారు. దేశ గౌరవం మరింతగా ఇనుమడించాలంటే, భారత సామాజిక తాత్వికుడు, రాజ్యాంగ నిర్మాతకు మించిన పేరు లేదనే విషయాన్ని ఇటీవలే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని కొత్త పార్లమెంట్‌ భవనానికి అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరుతూ త్వరలో ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. ఈ మేరకు సీఎం కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

ప్రజలందరికీ గర్వ కారణం
రాష్ట్ర ప్రధాన పరిపాలనా సముదాయ భవనమైన సెక్రటేరియట్‌కు అంబేడ్కర్‌ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘దేశ ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేడ్కర్‌ తాత్వికతను రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతోంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమున్నత స్థాయిలో నిలుపుతూ స్వయంపాలన కొనసాగించడం వెనక అంబేడ్కర్‌ ఆశయాలు ఇమిడి ఉన్నాయి. అంబేడ్కర్‌ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్‌ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ ఏర్పాటైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. అంబేడ్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేస్తోంది’ అని సీఎం పేర్కొన్నారు. 
మమ్మల్ని అంబేడ్కర్‌ స్ఫూర్తే నడిపిస్తోంది..

‘అంబేడ్కర్‌ కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉంది. ఫెడరల్‌ స్ఫూర్తిని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడతాయనే అంబేడ్కర్‌ స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తోంది. దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడటమే నిజమైన భారతీయత. అప్పుడే నిజమైన భారతం ఆవిష్కృతమౌతుంది. అందుకోసం మా కృషి కొనసాగుతుంది. అన్ని రంగాల్లో దార్శనికతతో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం, అంబేడ్కర్‌ పేరును సెక్రటేరియట్‌కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. జై భీం. జై తెలంగాణ. జై భారత్‌’ అని సీఎం తన ప్రకటనను ముగించారు.

ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top