‘పాజిటివ్‌’గా ఉండండి | Telangana: Minister KTR Speech In Media In Telangana Conference | Sakshi
Sakshi News home page

‘పాజిటివ్‌’గా ఉండండి

Nov 13 2022 12:22 AM | Updated on Nov 13 2022 12:22 AM

Telangana: Minister KTR Speech In Media In Telangana Conference - Sakshi

బంజారాహిల్స్‌: అన్ని రంగాల్లో దూసుకు­పో­తున్న తెలంగాణకు సంబంధించిన పాజిటివ్‌ వార్తలను మీడియా చూపాలని మున్సిపల్, ఐటీమంత్రి కె. తారక రామారావు సూచించారు. ప్రస్తుతం ఏ మీడియాలో అయినా పాజిటివ్‌ కంటే నెగెటివే ఎక్కువ వ్యాప్తి చెందుతోందన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో మీడియా అకాడమీ ఆఫ్‌ తెలంగాణ స్టేట్‌ ‘మీడియా ఇన్‌ తెలంగాణ పాస్ట్‌–ప్రజంట్‌–ఫ్యూచర్‌’ అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగిస్తూ హైదరా­బాద్‌లో వర్షం వచ్చినప్పుడు రెండు కాల­నీలు మునిగితే హైదరాబాద్‌ మునిగినంత హడావుడిగా వార్తలు పతాక శీర్షికలకు ఎక్కు­తున్నాయన్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రయాణించే హెలికాప్టర్‌ క్యాబిన్‌ హైదరాబాద్‌లో తయారవుతున్నా అది పతాక శీర్షికలకు ఎందుకు ఎక్కడం లేదని ప్రశ్నించారు.

చైనాలో భారీ ప్రాజెక్టు కడితే అది వార్త అవుతోందని.. అదే తెలంగాణలో కడితే మాత్రం వార్తల్లోకి ఎందుకు ఎక్కడంలేదని... ఇదెక్కడి పక్షపాతమన్నారు. మిషన్‌ భగీరథ వల్ల చెరువు కట్టలు బలంగా ఉండి తెగడం లేదని... అయితే ఇది వార్త కానట్లు­గా కట్ట తెగితేనే హెడ్‌లైన్స్‌లో వార్తలు ప్రచు­రిస్తున్నారన్నారు. పాలు, చేపలు, ధాన్యం ఉత్పత్తిలో అందరికంటే తెలంగాణ ముందుందని ఇవి ఎందుకు వార్తలు కావడంలేదన్నారు.

ప్రతిభ లేకుండా రాజకీయాల్లో రాణించలేరు..
ప్రతిభ లేకుండా రాజకీయాల్లో ఎవరూ రా­ణిం­చ­లేరని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాజకీయాల్లో వారసత్వం ఎంట్రీ కార్డ్‌గా మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వా­న్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారని గుర్తుచేశారు. సిరిసిల్ల­లో తొలిసారి పోటీ చేసిన తాను కేవలం 150 ఓట్ల తేడాతో గెలిచానని.. తన పనితీరుతో ప్రతి ఎన్నికల్లో­నూ మెజారిటీ పెంచుకుంటూ వచ్చానని చెప్పారు.

పరిశోధనాత్మక జర్నలిస్టులేరీ?
దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతున్నా అవి వార్తలుగా రావడం లేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం పరిశోధనాత్మక జర్నలిస్టులు లేకుండా పోయారని ఆవే­దన వ్యక్తం చేశారు. అయితే తాను పాత్రి­కేయులను నిందించడం లేదన్నా­రు. దేశంలో మీడియా ప్రస్తుతం ‘మోడియా’­గా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, అంబేడ్కర్‌ వర్సిటీ వీసీ సీతారామారావు, వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌ ఘంటా చక్రపాణి, ఎఫ్‌సీసీ చైర్‌ అడ్వయిజరీ కమిటీ ఇంటర్నేషనల్‌ జర్నలిస్టు ఎస్‌. వెంకట్‌ నారాయణ్, సీనియర్‌ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, సాక్షి  సీనియర్‌ జర్నలిస్టు విజయ్‌­కుమార్‌­రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పత్రికా పఠనం తండ్రి నేర్పిన అలవాటు..
తన తండ్రి కేసీఆర్‌ నేర్పిన కొన్ని అలవాట్లలో పేపర్‌ చదవడం కూడా ఒకటని కేటీఆర్‌ చెప్పారు. దీపావళి, దసరా సందర్భంగా రెండుసార్లు పత్రికలు రాకపోతే ఏదో కోల్పోయి­న భావన తనకు ఏర్పడుతుందన్నారు. నిత్యం తాను 13 పత్రికలు చదువుతున్నానని వివరించారు.

కొన్ని పత్రికలు చంద్రబాబును ఆహా.. ఓహో అన్నాయి
తెలంగాణ ఉద్యమం సహా టీఆర్‌ఎస్‌ స్థాపన సమయంలో తమకు మీడియా మద్దతు లభించలేదని మంత్రి కేటీఆర్‌ పేర్కొ­న్నారు. ముఖ్యంగా 2001లో టీఆర్‌­ఎస్‌ను స్థాపించిన సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని.. కొన్ని పత్రికలు మాత్రం ఆయన గురించి ఆహా... ఓహో అంటూ, ఇంద్రుడు, చంద్రుడు అంటూ రాసేవ­ని గుర్తుచేశారు.

ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు ఆయన వార్త­లు కొన్ని పత్రికల్లో పతాక శీర్షికల్లో నిత్యం నిలిచేవని, కేసీఆర్‌ పార్టీ పెట్టిన­ప్పుడు, ఉద్యమ సమయంలోనూ ఆ స్థాయి వా­ర్తలు రాలేదన్నారు. అయినప్పటికీ తెలంగా­ణ ఉద్యమం ఉధృతంగా ముందుకు సాగిందంటే అందుకు తెలంగాణ జర్నలి­స్టులే కారణ­మన్నారు. వారే తమకు అండగా నిలబ­డ్డా­రని.. అందుకే ఉద్యమానికి అండగా ని­లిచిన చాలా మంది జర్నలిస్టు­లకు సము­చిత స్థానం ఇచ్చి గౌరవించుకున్నామని కేటీఆర్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement