కేంద్రానిది కక్ష సాధింపే: జగదీశ్‌రెడ్డి

Telangana Minister Jagdish Reddy Criticized On Central Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వైఖరి ముమ్మాటికీ కక్ష సాధింపే అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా తెలంగాణకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తే ఈ తంతు అర్ధమవుతుందన్నారు. సోమవారం శాసనమండలిలో ‘కేంద్ర విత్యుత్‌ బిల్లు–పర్యవసానాలు’పై జరిగిన లఘు చర్చలో మంత్రి పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేపట్టిన సంక్షేమ పథకాలకు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు గుజరాత్‌ ప్రజలు సైతం కితాబిస్తున్నారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు ఉత్తర భారత ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఓర్వలేక రాష్ట్రంపై విషం కక్కే చర్యలకు దిగుతోందని విమర్శించారు.

రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే ఎజెండా 
స్వదేశీ బొగ్గును కాదని, విదేశీ బొగ్గు వినియోగించాలని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమని మంత్రి పేర్కొన్నారు. స్వదేశీ బొగ్గు మెట్రిక్‌ టన్ను రూ.3,800కు దొరుకుతుంటే, విదేశీ బొగ్గును రూ.35 వేలు వెచ్చించి కొనుగోలు చేయాలనడంఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విద్యుత్‌ నిర్వహణలో ఉత్పత్తి, విక్రయ కంపెనీలను కాకుండా కేంద్రం, రాష్ట్రం, ఆర్‌బీఐని భాగస్వామ్యం చేస్తూ కమిటీలను ఏర్పాటు చేయడం కూడా అర్థరహితమని అన్నారు. విద్యుత్, వ్యవసాయ రంగాలను తన చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, అన్ని అధికారాలను తన చేతుల్లోకి తీసుకుని రాష్ట్రాలను నిర్వీర్యం చేయడమే ఎజెండాగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్‌ బిల్లును వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సభను మంగళవారానికి వాయిదా వేశారు.

ఇదీ చదవండి: 20 లక్షల ఉద్యోగాలు ఊడతాయ్‌! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top