20 లక్షల ఉద్యోగాలు ఊడతాయ్‌!

CM KCR Demanded To Withdraw Electricity Amendment Bill 2021 - Sakshi

నా లెక్కలు తప్పయితే తక్షణమే రాజీనామా

అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌:  కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణల పేరుతో తీసుకొస్తున్న బిల్లును ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మరోసారి శాసనసభ తీర్మానం చేసి పంపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సోమవారం అసెంబ్లీలో ‘కేంద్ర విద్యుత్‌ బిల్లు’పై మాట్లాడిన కేసీఆర్‌.. గతంలో భూ, రైతు చట్టాలను ఉపసంహరించుకున్న విధంగానే విద్యుత్‌ సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన చట్టాలను కూడా ఉపసంహరించుకోవాలని సూచించారు. దేశంలో ఇప్పటికే ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలను ప్రైవేటు పరం చేశారని, ఇప్పుడు దేశంలోని విద్యుత్‌ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు. ఇదే జరిగితే దేశంలోని విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 20 లక్షల మంది ఉద్యోగాలు పోతాయని అన్నారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తాను చెబుతున్న లెక్కలు తప్పయితే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రాజీనామా చేస్తానని ప్రకటించారు.

దగాపై దేశం మేల్కొని పోరాడాలి.. 
‘జవహర్‌లాల్‌ నెహ్రూ కాలం నాటి నుంచి దశాబ్దాలుగా విద్యుత్‌ సంస్థలు, డిస్కంలు, ట్రాన్స్‌కో,జెన్‌కోల ద్వారా సముపార్జించిన లక్షల కోట్ల ఆస్తులను ప్రైవేటు షావుకార్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. సంస్కరణల పేరిట దేశానికి చేస్తున్న దగా ఇది. దీనిపై దేశం మేల్కొని పోరాడాలి. ఇవి ప్రజల ఆస్తులు... ఎక్కడిదాకైనా కొట్లాడతం..’అని ముఖ్యమంత్రి అన్నారు.  

‘రైతుబంధు’నిజమైన ఉద్దీపన 
‘ఉమ్మడి రాష్ట్రంలో 20 ఎకరాలున్న రైతులు కూడా నగరానికి వచ్చి కూలీ పనులు చేశారు. ఆటోలు నడిపారు. జగద్గిరిగుట్టకు వలస వచ్చారు. నిన్నా ఇవాళ రైతుల మొఖం తెల్లబడుతోంది. 66 లక్షల మందికి ఇచ్చే రైతుబంధు నిజమైన ఉద్దీపన. అందుకే ఏం చేసైనా సరే తెలంగాణలో ఉచిత విద్యుత్‌ బంద్‌ చేయాలని చూస్తున్నారు. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ ఈఆర్‌సీ రుణాలు రాకుండా అడ్డుపడుతున్నారు. కేంద్రం ఒత్తిడి మేరకు ‘ఉదయ్‌’పథకంలో చేరితే ఇబ్బందులు పెడుతున్నారు. ఎఫ్‌ఆర్‌ఎంబీలో కోతలు పెడతామని అంటున్నారు. విశ్వగురు విశ్వరూపం భయంకరం. శ్రీలంకలో భారత ప్రధానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు..’అని తెలిపారు. 

విద్యుత్‌ ఉద్యోగులు జూలు విదిలించాలి 
‘కేంద్రం తీసుకొచ్చే విద్యుత్‌ బిల్లుల వల్ల రైతులు, పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల విద్యుత్‌ బిల్లులను వెనక్కు తీసుకోవాలి. ఇది పోరాటాల గడ్డ.. పౌరుషాల గడ్డ.. ఇక్కడ మీ పిట్ట బెదిరింపులు పనిచేయవు. 20 లక్షల మంది విద్యుత్‌ ఉద్యోగులు జూలు విదిలించాలి. లక్షల కోట్ల విద్యుత్‌ ఆస్తులను కాపాడేందుకు ఉద్యమం చేయాలి. విద్యుత్‌ బిల్లు వెనక్కు తీసుకోకపోతే , బాయిల కాడ మీటర్లు పెడితే బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతాం..’అని సీఎం స్పష్టం చేశారు. 

తట్టుకోలేక కొత్త కుట్రలు.. 
‘తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి రావలసిన రూ.17,828 కోట్లు కేంద్రం ఇప్పించకుండా, తెలంగాణ బకాయి ఉన్న రూ.3 వేల కోట్లకు ఎక్కడా లేని విధంగా 18 శాతం వడ్డీ చొప్పున మరో రూ.3 వేల కోట్లు కలిపి నెలరోజుల్లో రూ.6 వేల కోట్లు చెల్లించాలని హుకుం జారీ చేసింది. నెలలో కట్టకపోతే చర్యలు తీసుకుంటారట. కేంద్రాన్ని రూపాయి అడగకుండా రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నది తెలంగాణ ఒక్కటే. దానిని కేంద్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈ వానాకాలం సీజన్‌లోనే 65 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. మొత్తం 1.30 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యే పరిస్థితి. దీన్ని తట్టుకోలేక కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఆనాడు సీలేరు ప్రాజెక్టును గుంజుకున్నారు. ఇప్పుడు కొత్త కుట్రలు చేస్తున్నారు..’అని కేసీఆర్‌ మండిపడ్డారు.

ఇదీ చదవండి: ఇంకా 18 నెలలే.. మోదీ సర్కారును దేవుడు కూడా కాపాడలేడు! 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top