నాణ్యత లేని భోజనం.. ‘ఎగ్‌’నామం

Telangana Low Quality Meals In Government Hospitals - Sakshi

నీళ్ల పాలు, మజ్జిగ .. నాణ్యత లేని కూరలు

ప్రభుత్వాస్పత్రుల్లో ఆహార ఏజెన్సీల నిర్వాకం

సాంబారు, నీళ్ల చారుతో సరిపుచ్చుతున్న వైనం

చాలాచోట్ల పాడైపోయిన అరటి పండ్ల పంపిణీ

అర్ధాకలితో అలమటిస్తున్న పేద రోగులు

పట్టించుకోని సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు అరకొరగా, నాణ్యతలేని ఆహారం అందుతోంది. గర్భిణులు, బాలింతలతోపాటు వివిధ రకాల వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న పేదలు, ప్రమాదాల బారిన పడిన సామాన్యులకు ప్రభుత్వాస్పత్రులే దిక్కు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఆర్థికస్తోమత లేకపోవడంతో ఎక్కువ మంది ఆయా జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులనే ఆశ్రయిస్తుంటారు.

పేదరోగుల ఆహారం కోసం ప్రభుత్వమే ఉద యం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఉచితంగా అందజేస్తోంది. ఈ మేరకు ధరలు నిర్ణయించి, నిబంధనలు విధించి.. ఈ బాధ్యతను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించింది. కానీ కాంట్రాక్టర్ల కక్కుర్తి, పర్యవేక్షించాల్సిన ఆయా ఆస్పత్రుల ఉన్న తాధికారుల నిర్లక్ష్యంతో చాలా ఆస్పత్రుల్లో రోగులు అర్ధాకలితో అలమటిస్తున్నట్టు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది.

జిల్లాల వారీగా పరిస్థితి ఇలా..
♦ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదిలాబాద్‌ రిమ్స్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో నాణ్యత లేని భోజనం సరఫరా చేస్తు న్నారు. ఆసిఫాబాద్‌లో కొన్నిసార్లు  భోజనమే పెట్టడం లేదు. నిర్మల్‌ జిల్లా ఆస్పత్రిలో అన్నం, చారుతోనే సరిపుచ్చుతున్నారు. కూరగాయలు వండ డం లేదు. కోడి గుడ్లు ఇవ్వడం లేదు. 
♦సిద్దిపేట జనరల్‌ ఆస్పత్రిలో రోగులకు  రోజూ అల్పాహారం, భోజనం అందిస్తు న్నారు. అలాగే ఈనెల 4వ తేదీ వరకు గుడ్డు ఇచ్చారు. కానీ దాదాపు 20 రోజు లుగా గుడ్డు ఇవ్వడం లేదు. అరటిపండు కూడా అందడం లేదు.
♦నిజామాబాద్‌ ఆస్పత్రిలో రోజూ 340 నుంచి 400 మందిరోగులకు  ఆహారం అందిస్తున్నారు. మెనూ ప్రకారం కాకుం డా ఉదయం ఎక్కువగా ఇడ్లీ మాత్రమే ఇస్తున్నారు. మధ్యాహ్నం భోజనంలో నీళ్లచారు మాత్రమే ఉంటోందని రోగులు ఆరోపిస్తున్నారు. 
♦నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోజూ గుడ్డు ఇస్తున్నారు. కానీ చిన్నగా ఉంటోంది. అరటిపండు రోజూ ఇవ్వాల్సి ఉన్నా.. కొందరికి మాత్రమే ఇస్తున్నారు. నీళ్ల చారు, మరీ పలుచగా మజ్జిగ ఇస్తున్నారని, కూరలు కూడా నీళ్లు నీళ్లుగా ఉంటున్నాయని చెబుతున్నారు.
♦మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రిలో  600 మంది రోగులకు, 50 మంది వైద్యులకు ఏజెన్సీ ఆహారం సరఫరా చేస్తోంది. నీళ్ల చారు, ఉడకని అన్నం పెడుతుండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.

రోగులకు ఏమివ్వాలి..
♦ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న సాధారణరోగులకు ఉదయం 4 బ్రెడ్డు ముక్కలు, 200 మిల్లీలీటర్ల పాలు.. మధ్యాహ్నం అన్నం, కూర, గుడ్డు, సాం బారు.. రాత్రి అన్నం, కూర, మజ్జిగ అంద జేయాలి. ఇందుకు ఒక్కొక్కరికి రూ.40 చొప్పున ఏజెన్సీకి ప్రభుత్వం చెల్లిస్తోంది.
♦పౌష్టికాహారలోపంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నవారికి ఉదయం 4 బ్రెడ్‌ ముక్కలు, 200 ఎంఎల్‌ పాలు.. మధ్యాహ్నం, రాత్రి అన్నం, 2 కూరలు,  గుడ్డు, అరటి పండు చొప్పున అందిం చాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభు త్వం ఏజెన్సీకి రూ.56 చెల్లిస్తోంది. 
♦బాలింతలకు బలవర్ధక ఆహా రం కోసం ఉదయం అల్పా హా రం కింద ఇడ్లీ లేదా ఉప్మా, 200 ఎంఎల్‌ పాలు, 4 బ్రెడ్డు ముక్కలు.. మధ్యాహ్నం, రాత్రి అన్నం, 2 కూరలు, గుడ్డు, అరటి పండు అందజేయాలి. ఇందుకోసం ఏజెన్సీకి రూ.వంద చొప్పున చెల్లిస్తోంది.

ఏజెన్సీలు ఏం చేస్తున్నాయి..
♦పలు ఆస్పత్రుల్లో వైద్యులకు ప్రత్యేకంగా నాణ్యమైన ఆహారం అందజేస్తుండగా.. రోగులకు మాత్రం నాసిరకమైన భోజనం పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.
♦ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజెన్సీల నిర్వాహకులు రోజువారీగా మెనూ ప్రదర్శించాల్సి ఉంది. ఆ మెనూ ప్రకారమే ఆహారం ఇవ్వాలి. కానీ ఇది చాలాచోట్ల అమలుకు నోచుకోవడం లేదు. 
♦చాలావరకు ఆస్పత్రుల్లో రెండు, మూడు బ్రెడ్డు ముక్కలు, తాగేందుకు వీలు లేనివిధంగా ఉన్న పాలు, అది కూడా చాలా తక్కువ పరిమాణంలో ఇస్తున్నారు. మధ్యాహ్నం కూర, సాంబారులో ఏదో ఒకటే ఇస్తుండగా, అరటిపండు ఎప్పుడో ఒకసారి ఇస్తున్నారు. ఒకవేళ ఇచ్చినా చాలావరకు పాడైనవే ఉంటున్నాయి. కొన్ని చోట్ల గుడ్డు ఇవ్వడం లేదు. అన్నంతో పాటు కూరలు సరిగా ఉండడం లేదు. నీళ్ల సాంబారుతో సరిపుచ్చుతున్నారు.

ఈ ఫొటోలో భోజనం చేస్తున్న ఈయన పేరు మోరే లక్ష్మణ్‌. ఆసిఫాబాద్‌ మండలం వెంకటాపూర్‌కు చెందిన ఈయనకు నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఇతనికి ఒక పూటే, అదికూడా నాసిరకమైన భోజనం అందుతోంది. దీంతో ఇంటి నుంచి తెప్పించుకుని తింటున్నాడు. రెండు రోజులుగా ఇక్కడ భోజనమే ఇవ్వలేదని మరికొందరు రోగులు చెప్పారు. గుడ్డు, పాలు, బ్రెడ్‌ కూడా రోజూ ఇవ్వడం లేదని లక్ష్మణ్‌ తెలిపాడు.

ఉడకని అన్నం పెడుతున్నారు..
మా బాబుకు రక్తం తక్కువగా ఉందని 9 రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నాం. ఆహారం అయితే రెండు పూటలు ఇస్తున్నారు. కాకపోతే కూరలు నీళ్ల మాదిరి ఉంటున్నాయి. అన్నం కూడా సరిగ్గా ఉడకడం లేదు.
– అనిత, పొల్కంపల్లి, భూత్పూర్, మహబూబ్‌నగర్‌

ఒక్కరోజే అరటి పండు 
ఐదు రోజుల కిందట కూతురి కాన్పు కోసం వచ్చాం. ఐదు రోజుల్లో ఒక్కరోజు మాత్రమే అరటి పండు ఇచ్చారు. గుడ్డు, భోజనం పెడుతున్నప్పటికీ అంత మంచిగా ఉండడం లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం తినిపిస్తున్నాం. 
–పగిడిమర్రి లక్ష్మమ్మ, నల్లగొండ 

అమల్లోకి రాని పెరిగిన రేట్లు
ఆస్పత్రుల్లో డైట్‌ నిర్వహణ బాధ్యతలను టెండర్‌ పద్ధతిన ఏజెన్సీలకు అప్పచెబుతున్నారు. నిర్ణయించిన రేటు ప్రకారం ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేస్తుంది. అయితే ప్రస్తుత రేట్లు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ధరలను రెట్టింపు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 21న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top