ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ వినూత్న పరిశోధన
భారతీయ ఆహారం అంటే కేవలం రుచి మాత్రమే కాదు.. సంస్కృతి, సంప్రదాయం, ప్రాంతీయ వైవిధ్యాల సమాహారం. దేశంలోని క్లిష్టమైన ఆహార పద్ధతులను అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కృత్రిమ మేధ (ఏఐ) రంగ ప్రవేశం చేసింది. ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ పరిశోధకులు కంప్యూటర్ విజన్ సాంకేతికతను ఉపయోగించి భారతీయ థాలీ భోజనంలోని కేలరీలను ట్రాక్ చేయడం, బిర్యానీ వంటి ఐకానిక్ వంటకాలను విశ్లేషించేలా పరిశోధనలు చేస్తున్నారు.
థాలీని అర్థం చేసుకోవడం ఎందుకు కష్టం?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ఫుడ్ ట్రాకింగ్ యాప్స్‌ను బర్గర్, శాండ్విచ్.. వంటి పాశ్చాత్య వంటకాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ భారతీయ థాలీ అందుకు భిన్నమైంది. ఒకే ప్లేట్‌లో అన్నం, పప్పు, కూర, పెరుగు, చట్నీ, అప్పడం.. వంటి చాలా పదార్థాలు కలిసి ఉంటాయి. దాంతో అందులో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం కష్టంగా మారుతుంది. ట్రిపుల్‌ఐటీలోని సెంటర్ ఫర్ విజువల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (CVIT) పరిశోధకులు దీనిపైనే దృష్టి పెట్టారు.
ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సి.వి. జవహర్ ప్రొఫెసర్ జవహర్ మార్గదర్శకత్వంలో యశ్ అరోరా, ఆదిత్య అరుణ్ రూపొందించిన ‘What is there in an Indian Thali’ అనే పరిశోధన పత్రం ఇటీవలే 16వ ఇండియన్ కాన్ఫరెన్స్ ఆన్ కంప్యూటర్ విజన్, గ్రాఫిక్స్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ (ICVGIP 2025)లో సమర్పించారు. భారతీయ భోజనంలోని వివిధ రకాల పదార్థాలను ఏఐ ఎలా గుర్తించగలదనే అంశంపై ఈ పరిశోధన సాగింది.
పరిశోధనలోని ముఖ్యాంశాలు
సాధారణంగా ఏఐ మోడళ్లకు ప్రతి కొత్త వంటకం కోసం మళ్లీ శిక్షణ ఇవ్వాలి. కానీ, భారతీయ వంటల్లో విభిన్న రకాల పప్పులు వివిధ రంగులు ఉంటాయి (ఉదాహరణకు పాలక్ పప్పు ఆకుపచ్చగా ఉంటుంది). దీనికోసం ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్ బృందం ‘జీరో-షాట్ లెర్నింగ్’ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇది కఠినమైన వర్గీకరణకు బదులుగా ‘ప్రోటోటైప్ మ్యాచింగ్’ ద్వారా పదార్థాలను గుర్తిస్తుంది. అలా థాలీ భోజనంలోని అన్ని పధార్థాలను గుర్తించి దానివల్ల ఎన్ని కేలరీలు సమకూరుతాయో తెలియజేస్తుంది.
గర్భిణీ స్త్రీల పోషకాహారాన్ని పర్యవేక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ఈ పరిశోధన సాగినట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రస్తుతం ఇది ఓవర్‌హెడ్ కెమెరాతో కూడిన కియోస్క్ సెటప్‌లో పనిచేస్తోంది. భవిష్యత్తులో దీన్ని మొబైల్ యాప్‌గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మసాలాల వినియోగం, వంట శైలిలోని తేడాలను విశ్లేషిస్తూ ‘ఇండియన్ ఫుడ్ మ్యాప్’ను పరిశోధకులు సిద్ధం చేస్తున్నారు.
బిర్యానీపై ప్రత్యేక దృష్టి
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బిర్యానీని టెస్ట్ కేస్‌గా తీసుకుని దేశంలో బిర్యానీ ఎలా తయారు చేస్తారనే అంశంపై పరిశోధన చేశారు. ఇందుకోసం వేలకొద్దీ యూట్యూబ్ వీడియోలను ఏఐ ద్వారా విశ్లేషించారు. హైదరాబాదీ బిర్యానీ, ఇతర బిర్యానీల మధ్య నూనె, మసాలాల వాడకంలో ఉన్న తేడాలను ఈ వ్యవస్థ గుర్తించగలదు. ‘ఉల్లిపాయల కంటే ముందు ఏ పదార్థం వేశారు?’ వంటి క్లిష్టమైన ప్రశ్నలకు కూడా ఇది సమాధానం ఇస్తుంది.
వంట గదిలో ఏఐ అసిస్టెంట్
ఈ సాంకేతికత భవిష్యత్తులో వంట చేసేటప్పుడు మన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేసే ఏఐ అసిస్టెంట్‌గా మారనుంది. ‘మీ అమ్మమ్మ పక్కన ఉండి వంట నేర్పించినట్టే, అవసరమైనప్పుడు మాత్రమే సూచనలిచ్చే ఏఐని తయారు చేస్తున్నాం’ అని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. ఇది కేవలం వంటకే కాకుండా నృత్యం, హస్తకళలు వంటి నైపుణ్య ఆధారిత విద్యను బోధించడానికి కూడా ఉపయోగపడనుంది. భారతీయ సంస్కృతిని, ఆధునిక సాంకేతికతను జోడించి ట్రిపుల్‌ఐటీ-హైదరాబాద్ చేస్తున్న ఈ పరిశోధన ఆహార విశ్లేషణ రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.
ఇదీ చదవండి: ఐపీఓ పెట్టుబడుల పేరుతో రూ.2.5 కోట్ల టోకరా!


