అక్కడ ఎనీ టైం మందు.. ఫుల్‌ కిక్కు..!

Telangana: Liquor Belt Shops Increases In Tanda Area Rajanna Sircilla - Sakshi

18 గ్రామాలు 25 బెల్టుషాపులు

కిరాణా దుకాణాల్లోనూ మద్యం విక్రయాలు

చోద్యం చూస్తున్న అధికారులు

సాక్షి,ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మారుమూల గిరిజన తండాల్లో మద్యం ఏరులై పారుతోంది. ఏ సమయంలోనైన(ఏనీటైం) మద్యం బాటిళ్లు దొరకడంతో మందుబాబులు తెల్లవారు జాము నుంచే మత్తులో తూగుతున్నారు. అర్ధరాత్రి గడిచిన గ్రామాల్లో బెల్డ్‌షాపుల్లో మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తండాలు, గ్రామాల్లోని కిరాణా దుకాణాల్లోనే బెల్టుషాపులు నిర్వహిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలకేంద్రంతోపాటు గ్రామాలు, తండాల్లో విచ్చలవిడిగా అనుమతులు లేకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.

మండలంలో 18 గ్రామాలుండగా, 25 బెల్టుషాపులు అనధికారికంగా ఏర్పాటు చేశారు. ఈ షాపుల్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తున్నారు. హోటళ్లు, బార్లను తలపిస్తున్నాయి. చీప్‌లిక్కర్‌తో మొదలుకొని అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నారు. బహిరంగంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అర్ధరాత్రి అందుబాటులో మద్యం
వీర్నపల్లి మండలంలోని తండాలు, గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్టుషాపుల్లో ఎప్పుడైనా మందు అమ్ముతున్నారు. ప్రభుత్వ అనుమతులు పొందిన మద్యం దుకాణాలను రాత్రి పదిన్నర గంటలకే మూసివేస్తుండగా, ఇక్కడ మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగిస్తున్నారు. డోర్‌ డెలీవరీ పద్ధతిలోనూ మద్యం విక్రయాలు సాగడం మరో విశేషం. ఒకప్పుడు నాటుసారా, గంజాయి మత్తులో తూగిన పల్లెలు.. ఇప్పుడు మద్యం కిక్కులో ఉంటున్నాయి.  

చర్యలు తీసుకుంటాం
అక్రమంగా బెల్టు షాపులను ఏర్పాటు చేసి మద్యం విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. దొంగచాటుగా మద్యం విక్రయాలు, హోటళ్లలో సిట్టింగులు పెట్టిన చట్టరీత్యనేరం. దాడులు చేసి బెల్టుషాపులను గుర్తించి మూసివేస్తాం.
– ఎంపీఆర్‌ చంద్రశేఖర్, ఎక్సైజ్‌ సీఐ,ఎల్లారెడ్డిపేట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top