నల్లగొండ సబితకు కేటీఆర్‌ అండ  

Telangana: KTR Helps Sabita Inter Second Year Student From Nalgonda - Sakshi

ఇంటర్‌ చదువుతూ కుటుంబ పోషణకు ఆటో నడుపుతున్న విద్యార్థిని  

ప్రగతి భవన్‌కు పిలిపించి సాయం అందించిన కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతూ కుటుంబ పోషణ కోసం ఆటో నడిపిస్తున్న నల్లగొండ విద్యార్థిని సబితకు అండగా ఉంటానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. నల్లగొండలో సబిత కుటుంబం ఆర్థిక పరిస్థితిని, ధైర్యంగా ఆటో నడుపుతూ డబ్బులు సంపాదిస్తున్న తీరును తెలుసుకున్న మంత్రి.. జిల్లా కలెక్టర్‌ ద్వారా వివరాలు తెప్పించుకున్నారు. ఆమెను స్వయంగా కలసి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.

ఇచ్చిన హామీ మేరకు సబితను బుధవారం హైదరాబాద్‌లో ప్రగతిభవన్‌కు పిలిపించుకొని మాట్లాడారు. చిన్నవయసులోనే కుటుంబ పోషణ కోసం ఆటోను నడిపిస్తూ మగవారికి తీసిపోని విధంగా ధైర్యంగా ముందుకు సాగుతున్న సబిత తీరును చూసి ఆయన అభినందించారు. ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కొద్ది సంవత్సరాల కిందట తండ్రిని కోల్పోవడంతో తన తల్లి ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చిందని తెలిపింది.

తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని సహాయం చేయాలని, కొత్త ఆటోరిక్షా ఇప్పించాలని సబిత కోరింది. కాగా, సబిత పేదరికాన్ని దృష్టిలో ఉంచుకొని డబుల్‌ బెడ్‌రూం ఇంటి ప్రొసీడింగ్స్‌తో పాటు ఆమె అడిగిన నూతన ఆటో రిక్షా ప్రొసీడింగ్స్‌ని కేటీఆర్‌ స్వయంగా అందించారు. సబిత చదువుకుంటానంటే తగిన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. సబిత తన కుటుంబానికి అండగా నిలిచిన తీరు ఇతర యువతులకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. కేటీఆర్‌ తనకు అండగా నిలవడంపై సబిత సంతోషం వ్యక్తం చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top