రూ.5 వేలు జీతంతో మాజీ జడ్జిని అవమానిస్తారా?

Telangana HighCourt Fire Ex Judge Honorary Wage Rs Five Thousand - Sakshi

హైకోర్టు మాజీ న్యాయమూర్తికి రూ.5 వేలు గౌరవ వేతనమా?

ఈ తరహా చర్యలు పూర్వ న్యాయమూర్తులను అవమానపర్చడమే

కొత్తగా న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన వారూ పనిచేయరు

రెండు రోజుల్లో జీవో జారీచేయాలని సర్కారుకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్‌ అథారిటీ చైర్మన్‌గా నియమితులయ్యే హైకోర్టు పూర్వ న్యాయమూర్తి గౌరవ వేతనం రూ.5 వేలుగా నిర్ణయించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్తగా న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయిన యువ న్యాయవాది కూడా ఆ వేతనానికి విధులు నిర్వహించడని మండిపడింది. సర్కారు ఇచ్చే రూ.5 వేల కోసం పూర్వ హైకోర్టు న్యాయమూర్తులు ఎదురు చూస్తుంటారని భావిస్తున్నారా అంటూ అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ తరహా చర్యలు పూర్వ న్యాయమూర్తులను అవమానపర్చడమేనంటూ అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ అప్పిలేట్‌ అథారిటీని ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం  మరోసారి విచారించింది.

అప్పీల్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌గా నియమించేందుకు పూర్వ న్యాయమూర్తి పేరు సిఫార్సు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తమకు లేఖ రాసిందని, అయితే అందులో గౌరవ వేతనం రూ.5 వేలు ఇస్తామని పేర్కొనడంపై ధర్మాసనం మండిపడింది. ఈ లేఖను తిరస్కరిస్తున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్, లోకాయుక్త తదితర రాజ్యాంగబద్ధమైన సంస్థల చైర్మన్లుగా నియమితులయ్యే పూర్వ న్యాయమూర్తులకు... వారు సర్వీసులో ఉన్నప్పుడు పొందిన చివరి వేతనాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొంది. ఈ నెల 27లోగా అప్పిలేట్‌ అథారిటీ చైర్మన్‌గా నియమించే వారికి కొత్త వేతనాన్ని నిర్ణయిస్తూ జీవో జారీచేయాలని స్పష్టం చేసింది. ఈ జీవో ఆధారంగా పూర్వ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేయాలంటూ మరోసారి లేఖ రాయాలని అడ్వొకేట్‌ జనరల్‌ను ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.

చదవండి: బరాబర్‌ ఆ నీళ్లు మావే!
చదవండి: ఈకాలంలోనూ రాజకీయమా.. చచ: కేటీఆర్‌ ఆగ్రహం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top