ఇందులో ప్రజాప్రయోజనం ఏముంది?

Telangana High Court Fires On Petitioner Over Fake Information - Sakshi

ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా తప్పుడు సమాచారమిస్తారా?

పిటిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం... రూ.50 వేలు జరిమానా

సాక్షి, హైదరాబాద్‌: తామిచ్చిన వినతిపత్రాలపై చర్యలు తీసుకోవడంతో పాటు తమపై పెట్టిన క్రిమినల్‌ కేసులను కొట్టివేయాలంటూ ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట సర్పంచ్‌ గట్టు కుమారస్వామి ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా... పిల్‌ దాఖలు చేసే ముందు ఈ అంశానికి సంబంధించి తమపై ఎలాంటి కేసులూ లేవని తప్పుడు అఫిడవిట్‌ ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఇందులో వ్యక్తిగత ప్రయోజనం తప్ప ప్రజాప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు రూ.50 వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

ఈ మొత్తాన్ని రెండు వారాల్లో న్యాయసేవా సాధికార సంస్థ ముందు డిపాజిట్‌ చేసి రసీదు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పునిచ్చింది. తమ గ్రామంలోని ప్రభుత్వ భూమిని ఎస్‌.మురళీధర్‌రావు అక్రమంగా ఆక్రమించుకున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, మురళీధర్‌రావు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కుమారస్వామి దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. కాగా, తీర్పును పునర్విచారించాలని కోరుతూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని పిటిషనర్‌ తరఫు న్యాయవాది సుజాత తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top