అన్ని జిల్లాల్లో అమ్ముదాం

Telangana Handicrafts Development Corporation Is On Path Of Expansion - Sakshi

రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ విస్తరణ బాట

జిల్లా కేంద్రాల్లో షోరూమ్‌లు తెరిచేందుకు ప్రణాళికలు

స్థలాల కోసం జిల్లా కలెక్టర్లకు లేఖలు

ప్రస్తుతం హైదరాబాద్‌ సహా పది చోట్ల షోరూమ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ హెచ్‌డీసీఎల్‌) విస్తరణ బాట పడుతోంది. రాష్ట్రంలో హస్తకళలపై ఆధారపడిన వారికి ఉపాధి కల్పించేందుకు గాను కార్యకలాపాల విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వివిధ జిల్లాల్లో తయారయ్యే హస్త కళాకృతులను హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా సహా మొత్తం 10 చోట్ల ‘గోల్కొండ’ బ్రాండ్‌ పేరుతో ఇప్పటికే విక్రయిస్తున్న ఈ సంస్థ.. అన్ని జిల్లా కేంద్రాల్లో విక్రయ షోరూమ్‌లు ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం ఆయా పట్టణాల్లోని ప్రధాన వాణిజ్య ప్రాంతాల్లో స్థలాలు కేటాయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్లకు లేఖలు రాసింది.

కరీంనగర్‌లో షోరూమ్‌ రెడీ
హైదరాబాద్‌లో ముషీరాబాద్, గన్‌ఫౌండ్రీ, సికింద్రాబాద్, బంజారాహిల్స్, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌తో పాటు వరంగల్, సంగారెడ్డి, సిద్దిపేట, ఢిల్లీ, కోల్‌కతాలో టీఎస్‌ హెచ్‌డీసీఎల్‌ గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్‌ షోరూమ్‌లు పనిచేస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో గోల్కొండ షోరూమ్‌ నిర్మాణం తుది దశలో ఉంది. త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

వరంగల్‌ జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో షోరూ మ్‌ కొనసాగుతుండగా శాశ్వత భవనాన్ని నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వరంగల్‌ పాత మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో 500 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం నామమాత్ర రుసుముతో కేటాయించింది. ఇక్కడ నిర్మించే షోరూమ్‌ కేవలం హస్త కళల విక్రయానికే కాకుండా హస్తకళాకారుల సేవా కేంద్రంగా, సంస్కృతి పరిరక్షణ కేంద్రంగా పనిచేయనుంది.  

4 చోట్ల కామన్‌ ఫెసిలిటీ సెంటర్లు
నిర్మల్‌ పెయింటెడ్‌ ఫర్నిచర్, ఎర్ర చందనం కళాకృతులు, నిర్మల్, చేర్యాల, బాతిక్‌ పెయింటింగ్స్, బిద్రీ, ఇత్తడి, సిల్వర్‌ ఫిలిగ్రీ వంటి లోహ కళాకృతులు గోల్కొండ షోరూమ్‌లలో విక్రయిస్తున్నారు. మంగళగిరి, పోచంపల్లి, సిద్దిపేట, గద్వాల చేనేత వస్త్రాలతో పాటు బంజారా ఎంబ్రాయిడరీ, కాటన్‌ డర్రీస్‌ వంటి ఉత్పత్తులు, లెదర్, ముత్యాలు, ఆభరణాలు వంటివి కూడా లభిస్తున్నాయి.

వీటన్నింటినీ తయారు చేసే హస్తకళాకారులకు అనువైన పని ప్రదేశాల కోసం 4 చోట్ల హస్తకళల అభివృద్ధి సంస్థ కొత్తగా కామన్‌ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటును ప్రతిపాదించింది. సంగారెడ్డి జిల్లా బొంతపల్లిలో చెక్కబొమ్మలు, కరీంనగర్‌లో సిల్వర్‌ ఫిలిగ్రీ, దేవరకొండలో బంజారా ఎంబ్రాయిడరీ, నిర్మల్‌లో నిర్మల్‌ బొమ్మల తయారీ కోసం ఈ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ముషీరాబాద్‌లోని హస్తకళా భవన్‌లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో మల్టీ క్రాఫ్ట్స్‌ కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. 

ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు
గోల్కొండ షోరూమ్‌ల ద్వారా హస్తకళాకృతులను విక్రయిస్తున్న హస్తకళల అభివృద్ది సంస్థ.. ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు కొనసాగించాలని నిర్ణయించింది. గతంలో ఈ కామర్స్‌ సంస్థలు ‘అమెజాన్‌’, ‘ఫ్లిప్‌కార్ట్‌’తో ఒప్పందాలు కుదుర్చుకుంది. సొంత ఆన్‌లైన్‌ విక్రయ వేదికపై హస్తకళాకృతులు అమ్మకాలు సాగించేందుకు ‘గోల్కొండ షాపింగ్‌’ పేరిట మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా గతేడాది ఏప్రిల్‌లో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

కానీ కరోనా వల్ల అశించినంత విక్రయాల్లేవని అధికారులు చెప్తున్నారు. హస్తకళాకృతుల విక్రయం ద్వారా 2020–21లో రూ.16.17 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గతేడాది డిసెంబర్‌ వరకు రూ.36.80 కోట్ల విలువైన కళాకృతులను విక్రయించారు. రాబోయే రెండేళ్లలో టర్నోవర్‌ను రూ. 60 కోట్లకు చేర్చడానికి హస్తకళల అభివృద్ధి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top