కొందరికే ‘గృహలక్ష్మి’!  | Telangana Gruha Lakshmi Scheme :Only One Lakh Seventy Five Thousand beneficiaries are selected | Sakshi
Sakshi News home page

కొందరికే ‘గృహలక్ష్మి’! 

Oct 10 2023 5:28 AM | Updated on Oct 10 2023 12:51 PM

Telangana Gruha Lakshmi Scheme :Only One Lakh Seventy Five Thousand beneficiaries are selected - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గృహలక్ష్మి లబ్ధిదారుల జాబితా తయారీ అర్ధాంతరంగా నిలిచిపోయింది. నాలుగు లక్షల మందితో జాబితా రూపొందించాల్సి ఉండగా, సోమవారం వరకు కేవలం 1.75 లక్షల మందికి మాత్రమే మంజూరు పత్రాలు జారీ చేయగలిగారు. దీంతో అంతే సంఖ్యతో లబ్ధిదారుల జాబితా రూపొందింది. ఎన్నికల కోడ్‌ అమలులోకి రావటంతో జాబితా రూపొందించే పని నిలిచిపోయింది.  

ఎమ్మెల్యేల జాబితాలతో జాప్యం.. 
గృహలక్ష్మి పథకానికి గత బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. సొంత జాగా ఉన్న ఒక్కో లబ్ధిదారుకు రూ.3 లక్షలు అందించాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తుల ప్రక్రియను మాత్రం చాలా ఆలస్యంగా ప్రారంభించింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో దరఖాస్తుల సేకరణ ప్రక్రియ ప్రారంభించగా, 15 లక్షల వరకు అందాయి. వాటి నుంచి 4 లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది.

నియోజకవర్గంలో ఏయే ఊళ్లు, ఒక్కో ఊరు నుంచి ఎంతమంది లబ్ధిదారులు.. అన్న విషయంలో అధికారపార్టీ ఎమ్మెల్యేలకు బాధ్యతను అప్పగించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోనే, లబ్ధిదారుల జాబితా రూపొందించాల్సి ఉన్నా.. వివరాలు మాత్రం ఎమ్మెల్యేలు అందించాల్సి ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు వేగంగా స్పందించగా, కొందరు జాప్యం చేశారు. ఫలితంగా జాబితా రూపొందించే ప్రక్రియ నత్తనడకన సాగింది. 

పూర్తి జాబితా కోసం ఈసీని అనుమతి అడుగుతామంటున్న అధికారులు 
ఈనెల ఆరో తేదీ తర్వాత ఏ క్షణాన్నయినా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో, ఐదో తేదీ రాత్రి వరకు జాబితాను సిద్ధం చేసి సమర్పించాల్సిందిగా సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలందాయి. కానీ, ఎమ్మెల్యేల నుంచి వివరాలు సకాలంలో అందకపోవటంతో.. సోమవారం నాటికి 1.75 లక్షల మందితో కూడిన లబ్ధిదారుల జాబితా సిద్ధమైనట్టు తెలిసింది.

కొన్ని జిల్లాల నుంచి వివరాలు అందాల్సి ఉందని, దీంతో ఆ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉందని అధికారులంటున్నారు. కోడ్‌ అమలులోకి వచ్చినందున, మిగతా లబ్ధిదారుల ఎంపిక ఇప్పట్లో ఉండదని, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాతనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయినా, పూర్తి జాబితా సిద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. 

ఏదైనా ఇక ఎన్నికల తర్వాతనే.. 
ఎన్నికలు ముగిసి కోడ్‌ అడ్డంకి తొలగిపోయిన తర్వాతనే ప్రక్రియ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చే ప్రభుత్వ ఆలోచనలకు వీలుగా ఈ పథకం భవిష్యత్తు ఆధారపడి ఉంది. కోడ్‌ అమలులోకి వచ్చే లోపు మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు మాత్రం రూ.3 లక్షల చొప్పున నిధులు విడుదలవుతాయి. వారు పనులు మొదలుపెట్టుకోవచ్చు. మిగతా లబ్ధిదారులకు నిధుల విడుదల ప్రక్రియ మాత్రం ఎన్నికల తర్వాతనే జరుగుతుందని అధికారులంటున్నారు. కొలువుదీరే కొత్త ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనుకుంటేనే ఆ ప్రక్రియ ముందుకు సాగుతుందని, లేనిపక్షంలో తదనుగుణంగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement