
మొగ్దుంపూర్ వద్ద టీజీఎండీసీ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు
సీసీ కెమెరాల ద్వారా ఇసుక లారీల కదలికలపై నిఘాకు సర్కారు కసరత్తు
డంపింగ్, బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకొనేందుకు టీజీఎండీసీ వినూత్న విధానం
దారి పొడవునా లారీలను గుర్తించేలా హైవేల వెంబడి అధునాతన సీసీ కెమెరాలు
టీజీఎండీసీ కేంద్ర కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ
పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు జిల్లాల ఎంపిక.. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ డంపింగ్, బ్లాక్ మార్కెటింగ్‌కు చెక్ పెట్టేందుకు తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) వినూత్న విధానాన్ని అమలు చేయనుంది. ఇసుక క్వారీల నుంచి బయల్దేరే లారీలు నేరుగా గమ్యస్థానానికి వెళ్తున్నాయా లేదా అనే విషయాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించనుంది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది.
ప్రస్తుతం ఇసుక క్వారీలు, రీచ్‌ల నుంచి లోడ్‌తో బయల్దేరే వాహనాలను అక్రమార్కులు నేరుగా బుకింగ్ చేసుకున్న చోటుకు కాకుండా ప్రైవేటు డంపుల వద్దకు తరలిస్తూ ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి తద్వారా భారీగా సొమ్ముచేసుకుంటున్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు టీజీఎండీసీ సిద్ధమవుతోంది.
హైవేలపై ఏఎన్‌పీఆర్ సీసీ కెమెరాలు
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకున్న ప్రతి వాహనమూ రీచ్ నుంచి బయల్దేరుతుండగా రీచ్ లేదా క్వారీలో ఇప్పటికే సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ హైవేల వెంబడి ఆ వాహనాలు దారిమళ్లాయో లేదో తెలుసుకొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆయా వాహనాలను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా హైవేలు, రాష్ట్ర రహదారుల వెంబడి ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్‌పీఆర్) సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలను అమర్చేందుకు టీజీఎండీసీ కసరత్తు చేస్తోంది.
ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలంలో రెండు చోట్ల ఐదు పాయింట్లను ఎంపిక చేసింది. ఇందుకోసం ఏఎన్‌పీఆర్ సాంకేతికతగల సీసీ కెమెరాలు, హైస్పీడ్ ఇంటర్నెట్, విద్యుత్ సదుపాయాలు సమకూర్చుకుంటోంది. సీసీ కెమెరాలు అమర్చేందుకు కావాల్సిన అనుమతుల కోసం ఇప్పటికే రాష్ట్ర హైవేలు, జాతీయ రహదారుల ఉన్నతాధికారులకు లేఖలు రాసింది.
ఏ వాహనం ఎప్పుడు, ఎటు వెళ్తోందో తెలుసుకొనేలా..
ఏఎన్‌పీఆర్ సీసీ కెమెరాల ద్వారా ఇసుక లారీల కదలికలను హైదరాబాద్‌లోని టీజీఎండీసీ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా అధికారులు కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. రీచ్ నుంచి ప్రతి వాహనం ఎప్పుడు బయల్దేరింది? ఏ దిశగా వెళ్తోందనే విషయాన్ని అక్కడి నుంచే ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.
వాస్తవానికి ఈ ప్రాజెక్టు నెల రోజుల కిందే ప్రారంభం కావాల్సి ఉండగా వర్షాల కారణంగా ఆలస్యంగా నడుస్తోందని అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసిన జిల్లాల్లో పర్యవేక్షణ అనంతరం అందులో తలెత్తే లోపాలు, సవాళ్లను అధ్యయనం చేసి ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇదే మోడల్‌ను అమలు చేసేందుకు టీజీఎండీసీ అధికారులు సిద్ధమవుతున్నారు.