జనవరి నెల నుంచి అద్దె డబ్బులు ఇవ్వం
కార్యాలయాలన్నీ ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిందే
ఉన్నతాధికారులకు సర్క్యులర్ జారీ చేసిన ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ ఆర్థిక శాఖ వివిధ విభాగాలకు షాక్ ఇచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదని, అలాంటి భవనాలకు జనవరి, 2026 నుంచి అద్దె చెల్లించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి, 2026 నుంచి ఎలాంటి అద్దెలు చెల్లించవద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సర్క్యులర్ జారీ చేశారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలకు సంబంధించిన కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలా ఎక్కడైనా ఉన్నా, ప్రభుత్వ భవనంలోకి మార్చేందుకు వెంటనే చర్యలు తీసుకోండి.
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా ఖాళీ ఉంది. అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌వోడీలు ఈనెల 31 లోపు ప్రభుత్వ భవనాల్లో ఖాళీలు వెతుక్కుని అక్కడకు ప్రభుత్వ కార్యాలయాలను మార్చాలి. జనవరి1, 2026 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో కొనసాగాల్సి ఉంటుంది. ప్రైవేటు భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు ఫిబ్రవరి1, 2026 నుంచి ఎలాంటి అద్దె చెల్లింపులు చేయవద్దని ట్రెజరీ అధికారులకు సూచిస్తున్నాం.
గ్రాంట్ ఇన్ ఎయిడ్, సీఎస్‌ఎస్ నిధుల నుంచి కూడా ఈ అద్దెలు చెల్లించడానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాధిపతి బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది’అని ఆ సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అన్ని శాఖల ప్ర«త్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్‌వోడీలు, సెక్రటేరియట్ విభాగాలు, ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలకు ఈ సర్క్యులర్‌ను పంపారు.


