హైదరాబాద్‌ శివార్లలో మళ్లీ భూముల వేలం..!

Telangana Govt May Again Start Land Auction In The Suburbs Of Hyderabad - Sakshi

హైదరాబాద్‌ శివార్లలో స్థలాల విక్రయానికి సర్కారు రెడీ

ఖానామెట్‌లో 22.79, పుప్పాలగూడలో 94.56 ఎకరాలు అమ్మకానికి..

మొత్తం 117.35 ఎకరాలకు 

రేపు నోటిఫికేషన్‌

సుమారు రూ. 6 వేల కోట్లు రావొచ్చని ప్రభుత్వం అంచనా

సాక్షి, హైదరాబాద్‌: భూముల వేలం ఖజానాకు కాసుల వర్షం కురిపిస్తుండటంతో తాజాగా మరో 117.35 ఎకరాల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా ఖానామెట్, పుప్పాలగూడలోని 35 ప్లాట్లను వచ్చే నెల 27, 29 తేదీల్లో వేలం వేసేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించి సోమవారం నోటిఫికేషన్‌ విడుదల కానుండగా ఆదివారం సాయంత్రం నుంచే ఆన్‌లైన్‌లో వేలం వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం ఖానామెట్‌లో 22.79 ఎకరాల విస్తీర్ణంలో 9 ప్లాట్లు, పుప్పాలగూడలో 94.56 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 26 ప్లాట్లు వేలం వేయనున్నారు. సెప్టెంబర్‌ 27న ఖానామెట్, 29న పుప్పాలగూడలో ఈ వేలం నిర్వహిస్తారు. వేలం ప్రక్రియ నిర్వహణకు టీఎస్‌ఐఐసీని రాష్ట్ర ప్రభుత్వం నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. ఈ నేపథ్యంలో దరఖాస్తు విధానం, వేలం ప్రక్రియ తదితరాలపై అవగాహన కల్పించేందుకు వచ్చే నెలలో టీఎస్‌ఐఐసీ ప్రీ–బిడ్‌ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం తేదీలు, అప్‌సెట్‌ ధర, ఈఎండీ, ఇతర నిబంధనలు సోమవారం వెలువడే నోటిఫికేషన్‌లో ఉంటాయని టీఎస్‌ఐఐసీ వర్గాలు వెల్లడించాయి. 

వచ్చే 6 నెలల్లో మరిన్ని భూములు సైతం! 
ప్రభుత్వ భూముల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో రూ.20వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే కరోనా, లాక్‌డౌన్‌ తదితర పరిస్థితుల్లో గత నెలలో జరిగిన వేలం పాటలో రూ.2729.78 కోట్లు సమకూరాయి. ప్రస్తుత వేలం ద్వారా సుమారు రూ. 6 వేల కోట్లు సమకూరుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే 6 నెలల్లో ఉప్పల్‌ భగాయత్‌ పరిధిలో ఖాళీగా ఉన్న ప్లాట్లతోపాటు మియాపూర్‌ మెట్రో సమీపంలోని స్థలాలను కూడా వేలం వేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మియాపూర్‌ సమీపంలోని హెచ్‌ఎండీఏ భూములతోపాటు జవహర్‌నగర్, బుద్వేల్, రావిర్యాల, కొంగర ఖుర్ద్, మహేశ్వరం, తుమ్మలూరు ప్రాంతాల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్లాట్లను రాబోయే రోజుల్లో వేలం వేసే అవకాశమున్నట్లు తెలిసింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top