మహిళలకు రిజర్వేషన్లు.. ప్రతి కేటగిరీలో 33.3% | Sakshi
Sakshi News home page

మహిళలకు రిజర్వేషన్లు.. ప్రతి కేటగిరీలో 33.3%

Published Fri, Feb 16 2024 4:49 AM

Telangana Govt implements 33 percent horizontal reservation for women in recruitment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల్లో మహిళలకు హారిజాంటల్‌ (సమాంతర) పద్ధతిలో 33 1/3 శాతం (33.333%) రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఆ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు జారీ (జీఓ.ఎంఎస్‌.3) చేశారు. వీటి ప్రకారం మహిళలకు ఓపెన్‌ కాంపిటీషన్‌ (ఓసీ)తో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్విస్‌మెన్, క్రీడాకారుల కోటాలో హారిజాంటల్‌ పద్ధతి (రోస్టర్‌ పట్టికలో ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్‌ లేకుండా)లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.

ఇప్పటివరకు వర్టీకల్‌ పద్ధతి (పట్టికలోని పోస్టుల్లో కొన్నిటిని ప్రత్యేకంగా మహిళలకంటూ మార్కింగ్‌ ఇచ్చేవారు)లో ఉద్యోగ నియామ కాలు చేయగా.. ఇకపై ఎలాంటి మార్కింగ్‌ చేయకుండా 33 1/3శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం సూచించిన మెథడాలజీ ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలుకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులు రద్దు చేసింది.

ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేకంగా జీవో జారీ చేయనుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 

మెమోకు అనుగుణంగా ఉత్తర్వులు 
మహిళలకు హారిజాంటల్‌ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధారణ పరిపాలన శాఖ తరపున ఒక మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెమోను అన్ని నియామక సంస్థలకు పంపించారు. ఈ విషయంలో న్యాయ వివాదాలు తలెత్తకుండా మహిళా శిశు సంక్షేమశాఖ 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 1996లో జారీ చేసిన జీవో నం.41కు, రాష్ట్ర సబార్డినేట్‌ సర్విసు నిబంధనలు రూల్‌.22కు సవరణలు చేయాలని పేర్కొంటూ టీఎస్‌పీఎస్సీ ఈనెల 8న మహిళా శిశు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మహిళలకు రోస్టర్‌ పాయింట్‌ లేకుండా హారిజాంటల్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement