ఉద్యోగుల ఆశలపై మళ్లీ నీళ్లు చల్లిన కరోనా మహమ్మారి 

Telangana Govt Employees April Salary Bills As Per Current Pay Scale - Sakshi

మేలో పాత జీతాలే! 

పీఆర్సీ జీవో విడుదలలో జాప్యమే కారణం 

ప్రస్తుత పే స్కేల్‌ ప్రకారమే ఏప్రిల్‌ జీతాల బిల్లులు 

ఇప్పుడు జీవో వచ్చినా జూన్‌లోనే అమల్లోకి వేతన సవరణ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతన సవరణ (పీఆర్సీ) ఆశలపై కరోనా మహమ్మారి మరోసారి నీళ్లు చల్లింది! ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేస్తామని, ఏప్రిల్‌ 1 నుంచి వేతన సవరణ అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్‌ మార్చి 22న అసెంబ్లీ వేదికగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఈలోగా కరోనా మళ్లీ విజృంభించడంతో పీఆర్సీ అమలు మళ్లీ అటకెక్కిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ అమలు విధివిధానాలను ప్రకటిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయడంలో జాప్యం జరుగుతుండటమే ఇందుకు కారణం. ముసాయిదా జీవోకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదముద్ర వేసిన వెంటనే ఈ ఉత్తర్వులు జారీ చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. పీఆర్సీ జీవో ఎప్పుడు జారీ అవుతుందో స్పష్టత లేకపోవడంతో ప్రస్తుత మూల వేతనాల ఆధారంగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రెజరీలు ఉద్యోగుల జీతాల బిల్లులను రూపొందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు పాత వేతనాలనే అందుకుంటారని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కరోనా తొలి వేవ్‌ కారణంగా పీఆర్సీ ప్రకటనలో తీవ్ర జాప్యం జరగ్గా రెండో వేవ్‌ కారణంగా పీఆర్సీ అమలు మళ్లీ వాయిదా పడే పరిస్థితులు తలెత్తాయని ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉండటం, కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌ ఇంకా కోలుకుంటుండటంతో పీఆర్సీ అమలుపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోలేకపోయిందని తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వం పీఆర్సీపై జీవో జారీ చేసినా పెరిగిన జీతాలను ఉద్యోగులు జూన్‌లోనే అందుకుంటారని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. పీఆర్సీ జీవో వచ్చాక ఏ తేదీ నుంచి వేతన సవరణ వర్తింపజేయాలి అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యక వేతన సవరణ ప్రయోజనాలు ఉద్యోగులు లభించనున్నాయి.  

చిరుద్యోగుల భారీ ఆశలు... 
వేతన సవరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వంలోని చిరుద్యోగులు భారీ ఆశలతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, వీఏఓలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, డెయిలీ వేజ్‌ తదితర కేటగిరీలు కలుపుకొని 9,17,797 మంది ఉద్యోగుల వేతనాలను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రస్తుతం గ్రూప్‌–4 కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు నెలకు రూ. 12 వేల కనీస వేతనం లభిస్తుండగా దాన్ని రూ. 19 వేలకు పెంచాలని సీఆర్‌ బిస్వాల్‌ నేతృత్వంలోని తెలంగాణ తొలి పీఆర్సీ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గ్రూప్‌–3 కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలను రూ. 15 వేలు/19,500 నుంచి రూ. 22 వేలకు పెంచాలని సూచించింది. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏటా రూ. 1,000 ఇంక్రిమెంట్‌ ఇవ్వాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసుల అమలుపై కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు భారీ ఆశలతో ఎదురుచూస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top