గ్రామ స్వరాజ్యం.. మహిళలకే పెద్దపీట.. రాష్ట్రంలో 4,30,684 సంఘాలు

Telangana Government Strengthening Women Self Help Groups - Sakshi

మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం 

కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పాటు 

వస్తువుల విక్రయానికి  దేశ, విదేశాల్లో మేళాలు 

ఫ్లిప్‌ కార్ట్, ప్లాంట్‌ లిపిడ్స్‌ ద్వారా మార్కెటింగ్‌ అవకాశాలు

సాక్షి, హైదరాబాద్‌: గ్రామస్వరాజ్య లక్ష్య సాధనలో గ్రామీ ణ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేద, ఇతర వర్గాల మహిళలు సొంతంగా తమ కాళ్లపై నిలబడడంతో పాటు ఒక సంఘటిత శక్తిగా ఎదిగేందుకు వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని వారితో సమానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఘాలు మహిళలను పొదుపు వైపు మళ్ళించి, ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తోడ్పతున్నాయి. 

మెరుగైన స్వయం ఉపాధి 
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 4,30,648 సంఘాలు ఉండగా, వాటిలో 46,09,843 మంది సభ్యులున్నారు. ఈ సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో అనేకమంది మహిళల స్వయం ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ప్రజలు రోజూ ఉపయోగించే వస్తువులను స్థానికంగా ఉత్పత్తి చేయడంలో శిక్షణనిచ్చి వారిని తయారీరంగం వైపు మళ్ళి స్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు 32 జిల్లా, 553 మండల, 17,980 గ్రామ సమాఖ్యలు పనిచేస్తున్నాయి. మహిళలు తమకున్న నైపుణ్యాలతో రకర కాల వస్తువులను తయారు చేస్తున్నారు. వీటి విక్రయానికి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో మేళాలు ఏర్పా టు చేస్తున్నారు. బంగ్లాదేశ్‌ సహా వివిధ దేశా ల్లో నిర్వహించిన ప్రదర్శనలకు రాష్ట్ర మహిళలు హాజరయ్యారు.  

సెర్ప్‌ ద్వారా రూ.65 వేల కోట్ల బ్యాంక్‌ లింకేజీ 
రాష్ట్రంలో గ్రామీణ దారిద్య్ర నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) ద్వారా 2022–23లో ఈ సంఘాలకు రూ.15 వేల కోట్ల బ్యాంక్‌ లింకేజీ కల్పన లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు 32 జిల్లాల్లోని మహిళా సంఘాలకు నిర్దేశిత బ్యాంక్‌ లింకేజీ లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందించే చర్యలు ఊపందుకున్నాయి. ఇప్పటికే రూ.6,887 కోట్ల మేర లింకేజీ కల్పించారు. 2023 మార్చి 31 లోగా ఈ లింకేజీలు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నారు. సెర్ప్‌ ద్వారా గత 8 ఏళ్లలో (2014–15 నుంచి 2021–22 వరకు) రూ.65 వేల కోట్ల బ్యాంకు లింకేజీ కలి్పంచినట్టు పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు.    

ప్లిప్‌కార్ట్, ప్లాంట్‌ లిపిడ్స్‌తో సెర్ప్‌ ఒప్పందం 
మహిళా సంఘాల ఉత్పత్తులకు దేశ, విదేశాల్లో విస్తృత మార్కెటింగ్‌ అవకాశాల కల్పనకు ఈ కామర్స్‌ సంస్థలు ఫ్లిప్‌ కార్ట్, ప్లాంట్‌ లిపిడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో సెర్ప్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా 140 రకాల ఉత్పత్తులు ఫ్లిప్‌ కార్ట్‌ ద్వారా ఆన్‌లైన్లో విక్రయానికి వీలు కుదిరింది. ఇలాంటి ఎంవోయూ కుదరడం దేశంలోనే మొదటిసారి. కాగా దీనివల్ల స్థానికంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. ఈ ఏడాది రూ. 500 కోట్ల వ్యాపార లక్ష్యంగా నిర్దేశించారు. మహిళా సంఘాలకు చెందిన ఎండుమిర్చి ఉత్పత్తుల మార్కెటింగ్‌ కోసం ఈ ఏడాది రూ.200 కోట్ల వ్యాపారం లక్ష్యంగా ప్లాంట్‌ లిపిడ్స్‌తో ఒప్పందం కుదిరింది.
చదవండి: వానాకాలం సీఎంఆర్‌పై నీలినీడలు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top