సవరణ సమాప్తం!

Telangana Government Process Of Revision Of Lands And Assets Almost Complete - Sakshi

భూములు, ఆస్తుల ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ దాదాపు పూర్తి 

కొన్ని జిల్లాలకు తుది విలువలు పంపిన ఉన్నతాధికారులు 

జీహెచ్‌ఎంసీతో పాటు మరికొన్ని జిల్లాల్లో నేడు ఖరారు 

30,31 తేదీల్లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, ధరణి పోర్టల్‌ బంద్‌? 

ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త విలువలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణ ప్రక్రియ దాదాపు పూర్తయింది. జీహెచ్‌ఎంసీతో పాటు నాలుగైదు జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు వ్యవసాయేతర ఆస్తులు, భూముల తుది సవరణ ప్రతిపాదనలు చేరుకున్నాయి. వ్యవసాయ భూములకు సంబంధించిన సవరణ విలువలతో పాటు జీహెచ్‌ఎంసీ, నాలుగైదు జిల్లాల విలువలకు నేడు తుదిరూపు రానుంది.  

వ్యవసాయ భూములు 50–75% పెంపు 
ఇప్పటివరకు పూర్తయిన కసరత్తు ప్రకారం వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలను 50–75 శాతం పెంచనున్నారు. బహిరంగ మార్కెట్‌లో భారీగా రేట్లు పలుకుతున్న భూముల విలువలను మాత్రం 100 శాతం పెంచుతారు. ఇక ఖాళీ స్థలాలకు సంబంధించి 20–35 శాతం, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లకు సంబంధించి 15–25 శాతం విలువల సవరణను ఖరారు చేశారు.

అయితే, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే చాలాచోట్ల ప్రభుత్వ విలువలు అధికంగా ఉన్నాయి. ఖాళీ స్థలం ప్రాంతాన్ని బట్టి రూ.9 వేల నుంచి రూ.80 వేల వరకు ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్ల విలువలను తక్కువగానే సవరిస్తారని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 10 శాతం నుంచి ఈ సవరణ ప్రారంభమై 25 శాతం పెంపుతో ముగియనుందని సమాచారం. 

మూడు రోజులు క్షేత్రస్థాయిలో.. 
భూముల విలువల సవరణ ప్రక్రియ ఉన్నతస్థాయిలో శుక్రవారం నాటికి పూర్తికానుండడంతో శని, ఆది, సోమ వారాల్లో క్షేత్రస్థాయిలో సమావేశాలు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ కార్యాలయం నుంచి వచ్చిన ప్రతిపాదనలు, ప్రాంతాల వారీ వివరాలను సరిచూసుకున్న అనంతరం క్షేత్రస్థాయి కమిటీలు వీటికి ఆమోదం తెలుపనున్నాయి. ఇందుకోసం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈనెల 29న తహశీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లతో సమావేశాలు జరగనున్నాయి.

కాగా, కొత్త విలువలను అప్‌లోడ్‌ చేయడంతో పాటు పాత విలువల ప్రకారం చేసిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పెండింగ్‌ లేకుండా 100 శాతం పూర్తి చేసేందుకు గాను ఆది, సోమవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పాటు ధరణి పోర్టల్‌ లావాదేవీలను బంద్‌ చేస్తారని తెలుస్తోంది. కొత్త విలువల ప్రకారం డాక్యుమెంట్లు వస్తున్నాయా లేదా అనే వివరాలను సరిచూసుకోవడం, సాంకేతిక పరమైన సమస్యలను నివృత్తి చేసుకునేందుకు గాను సోమవారం కూడా సెలవు ఉంటుందని, ఇక మంగళవారం నుంచి కొత్త విలువలు అమల్లోకి వస్తాయని తెలుస్తోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top