తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు ఖరారు

Telangana government Nod To Movie Ticket Rates Hike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని సినిమా థియేటర్లలో టికెట్ల రేట్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిర్మాతల విజ్ఞప్తి మేరకు రేట్ల పెంపుపై ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపగా.. వాటిని పరిశీలించిన రాష్ట్రప్రభుత్వం టికెట్‌ రేట్లు నిర్ణయించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా జీవో నెంబర్‌ 120 జారీచేశారు. దీని ప్రకారం ఏసీ, ఎయిర్‌ కూల్డ్‌ థియేటర్‌లలో సినిమా టికెట్‌ కనిష్ట ధర రూ.50 కాగా, గరిష్టంగా రూ.150గా నిర్ణయించారు.

జీఎస్టీ అదనం. నాన్‌ ఏసీ థియేటర్లలో టికెట్‌ కనీస ధర రూ.30 కాగా, గరిష్టంగా రూ.70గా నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ కనీస ధర రూ.100+జీఎస్‌టీ.. గరిష్టంగా రూ.250+జీఎస్‌టీగా ఖరారు చేశారు. రిక్లైనర్స్‌ కోసం రూ.300+జీఎస్‌టీగా మల్టీప్లెక్స్‌ల్లో టికెట్‌ రేట్ల ను నిర్ణయించారు. ఇవికాకుండా నిర్వహణ ఖర్చుల కింద టికెట్‌పై ఏసీ, ఎయిర్‌ కూల్డ్‌ థియేటర్లలో రూ.5, నాన్‌ ఏసీలలో రూ.3 వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. 

టికెట్‌ ధరల సవరణకు జీవో ఇచ్చాం 
సాక్షి, హైదరాబాద్‌: ఏసీ, నాన్‌ ఏసీ, మల్టీప్లెక్స్‌ సినిమా హాళ్లలో టికెట్ల ధరలను సవరించి పెంచుకునేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేశామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈమేరకు స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్‌ టి.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణను శుక్రవారం ముగించింది. ప్రభుత్వం తాజాగా జారీచేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉంటే మరో పిటిషన్‌ దాఖలు చేసుకోవాలని పిటిషనర్‌కు సూచించింది.

ప్రభుత్వ జీవో ఏ విధంగా నిబంధనలకు విరుద్ధమో స్పష్టమైన ఆధారాలు సమర్పించాలని పేర్కొంది. సినిమా టికెట్ల ధరలను నియంత్రించాలంటూ గతేడాది జూలైలో తానిచ్చిన వినతిపత్రంపై సంబంధిత అధికారులు స్పందించడం లేదంటూ న్యాయవాది జీఎల్‌ నరసింహారావు రాసిన లేఖను గతంలో ధర్మాసనం సుమోటో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)గా విచారణకు స్వీకరించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top