అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే

Telangana: Forest Authorities Issued Notices To Gothikoyas - Sakshi

గొత్తికోయలకు అటవీ అధికారుల నోటీసులు! 

చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారు ఎర్రబోడులో నివాసం ఉంటున్న గొత్తికోయలు అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. ఎర్రబోడుకు చెందిన ఇద్దరు గొత్తికోయలు ఈనెల 22న చేసిన దాడిలో ఎఫ్‌ఆర్‌ఓ చలమల శ్రీనివాసరావు మృతి చెందిన ఘటనతో తీవ్రస్థాయిలో నిరసన పెల్లుబికింది.

ఈ క్రమంలో బెండాలపాడు పంచాయతీ పాలకవర్గం సైతం గొత్తికోయలను ఈ ప్రాంతం నుంచి బహిష్కరిస్తూ తీర్మానం చేసింది. ఇక ఆదివారం ఎఫ్‌డీఓ అప్పయ్య అధ్వర్యంలో వివిధ రేంజ్‌ల అధికారులు, సిబ్బంది సుమారు 50 మంది.. గొత్తికోయల ఇళ్ల వద్దకు వెళ్లి ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇచ్చారు. కాగా తమ ఇళ్ల ముందు నోటీసులు అంటించి, ఫొటోలు తీసుకుని అనంతరం వాటిని తొలగించారని గొత్తికోయలు చెబుతున్నారు.

వాస్తవానికి ఈ వ్యవహారాన్ని తొలుత అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ ఘటనపై ఎఫ్‌డీఓ అప్పయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. అడవి నుంచి ఖాళీ చేయాలని గొత్తికోయలకు నోటీసులు ఇచ్చిన విషయం వాస్తవమేనన్నారు. ఎఫ్‌ఆర్వో హత్యతో అడవిలో విధులు నిర్వర్తించేందుకు అధికారులు, సిబ్బంది భయపడుతున్నారని చెప్పారు. 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం వారు అడవుల్లో ఉండేందుకు అనర్హులని పేర్కొన్నారు.

ఒకరిద్దరు తప్పు చేస్తే అందరికీ శిక్షా ?
మా గూడెంలోని ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గపు చర్యకు మా అందరికీ శిక్ష విధిస్తారా. ఛత్తీస్‌గఢ్‌లో శాంతిభద్రతల పరిస్ధితి అధ్వానంగా ఉండగా ప్రాణభయంతో జీవనోపాధి కోసం 20 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి వచ్చాం. పోడు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాం. మా తెగకు చెందిన పొడి­యం తుల, మడకం నంగా రేంజర్‌ శ్రీనివా­సరావుపై దాడి చేసి హతమార్చడాన్ని మేము కూడా ఖండిస్తున్నాం.

వారు చేసిన తప్పునకు మేమంతా ఎందుకు శిక్ష అనుభవించాలి. మాకు ఇక్కడ రేషన్‌కార్డులు, ఆధార్‌కార్డులు, ఉపాధి పనుల కార్డులు ఇచ్చారు. ఓటుహక్కు కూడా కల్పించారు. మా పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలతో మేం ఎక్కడికి వెళ్ళాలి. తెలంగాణ ప్రభుత్వం మాపై కనికరించాలి.
– రవ్వ రమేశ్, గొత్తికోయ కులపెద్ద, ఎర్రబోడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top