పక్కాగా లెక్క..కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్‌సీఐ

Telangana: Fci Conducts Surprise Checks in Raw Rice Mills - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా రైస్‌ మిల్లుల్లో బస్తాల ప్రత్యక్ష తనిఖీలు షురూ

సీఎంఆర్‌ విషయంలో అక్రమాలు జరుగుతున్నట్టు అనుమానం

కేంద్రం ఆదేశాలతో రంగంలోకి ఎఫ్‌సీఐ

124 మంది అధికారులతో మొత్తం 62 బృందాల ఏర్పాటు

గత ఏడాది యాసంగి, మొన్నటి వానాకాలం సీజన్ల లెక్కలు తేలుస్తున్న అధికారులు.. మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వలు, రికార్డుల పరిశీలన

సహకరించాలని మిల్లర్లకు ప్రభుత్వం సూచన.. ఈ నెల 15 వరకు 2,300 మిల్లుల్లో కొనసాగనున్న తనిఖీలు

వివరాలు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదన

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో ప్రత్యక్ష తనిఖీలకు భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) శ్రీకారం చుట్టింది. ధాన్యం సేకరణ, కస్టమ్‌ మిల్లింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయనే అనుమానాల నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలతో ఎఫ్‌సీఐ అధికారులు రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని ప్రతి రైస్‌మిల్లును ప్రత్యక్షంగా తనిఖీ (ఫిజికల్‌ వెరిఫికేషన్‌(పీవీ) చేయాలని, ప్రతి బస్తా లెక్క తేల్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తనిఖీ  కార్యక్రమం మొదలైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక మిల్లుల్లో తనిఖీలు కొనసాగాయి. ఆయా జిల్లాల పౌరసరఫరా అధికారులతో కలిసి ఎఫ్‌సీఐ అధికారులు బృందాలుగా ఏర్పడి మిల్లుల్లో నిల్వలను, రికార్డులను పరిశీలించారు. పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్‌ తదితర జిల్లాల్లో మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యం, బియ్యం బస్తాలను లెక్కించారు. తనిఖీల్లో తేలిన అంశాలతో ఓ నివేదికను త్వరలో ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు తెలిపారు. 

అక్రమాలపై అనుమానంతోనే..
    రాష్ట్రంలోని రైస్‌ మిల్లుల్లో ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ చేసే విషయంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని అనుమానిస్తున్న ఎఫ్‌సీఐ ఇక నుంచి ఫిజికల్‌ వెరిఫికేషన్‌ తర్వాతే బియ్యం సేకరించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ వల్ల కాలయాపన జరిగి, నిర్ణీత సమయంలో సీఎంఆర్‌ ఇవ్వలేమన్న పౌరసరఫరాల శాఖ వాదనను తోసిపుచ్చిన ఎఫ్‌సీఐ కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రంలోని ఏడు ఎఫ్‌సీఐ డివిజనల్‌ కార్యాలయాల పరిధిలోని 33 జిల్లాల్లో ఉన్న అన్ని రైస్‌ మిల్లుల్లో ఈ తనిఖీలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా వేర్‌హౌసింగ్‌ గోడౌన్‌ డిపోల మేనేజర్లు, ఇతర అధికారులతో 62 బృందాలను ఎఫ్‌సీఐ ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ఇద్దరేసి అధికారులు ఉన్నారు. వీరు ఆయా జిల్లాల పౌరసరఫరాల శాఖ అధికారులతో కలిసి తమకు కేటాయించిన డివిజన్లలోని జిల్లాల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్‌ జరపనున్నారు. 

రెండు సీజన్ల ధాన్యం తనిఖీ
    గత ఏడాది (2020–21) యాసంగి సీజన్‌తో పాటు మొన్నటి వానాకాలం (2021–22) సీజన్లకు సంబంధించిన ధాన్యంపై తనిఖీలు సాగుతున్నాయి. గత యాసంగి సీజన్‌కు సంబంధించి 475 మిల్లులు, వానాకాలం సీజన్‌ ధాన్యంకు సంబంధించి 1,825 మిల్లులను తనిఖీ చేయనున్నారు. తనిఖీలకు అనుగుణంగా ధాన్యం బస్తాలను అందుబాటులో ఉంచాలని ఎఫ్‌సీఐ ఇప్పటికే మిల్లుల యాజమాన్యాలను ఆదేశించింది. కాగా గత మార్చి నెలలో 958 మిల్లుల్లో తనిఖీ నిర్వహించగా, 40 మిల్లుల్లో నిల్వల్లో తేడా ఉన్నట్లు ఎఫ్‌సీఐ అధికారులు గుర్తించారు. 4.54 లక్షల బ్యాగుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. 

తనిఖీల తర్వాతే వానాకాలం బియ్యం సేకరణ
    గత యాసంగికి సంబంధించి సీఎంఆర్‌ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఏప్రిల్‌ నెలాఖరు నాటికి మరో 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. అయితే గడువు ముగియడంతో సీఎంఆర్‌ గడువును నెలరోజలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీనిపై ఇంకా నిర్ణయం రాలేదు. కాగా ఇప్పుడు యాసంగి ధాన్యానికి సంబంధించి తనిఖీలు జరపనున్న 475 మిల్లుల్లో సీఎంఆర్‌ ఎంతమేర పూర్తయిందో తెలియదు. ఒకవేళ సీఎంఆర్‌ పూర్తయితే.. యాసంగి సీజన్‌లో ఆయా మిల్లులకు వచ్చిన ధాన్యం, ఇచ్చిన బియ్యం లెక్కలను, స్టాక్‌ రిజిస్టర్‌లను పరిశీలించి బేరీజు వేసుకొని అక్రమాలు జరిగాయో లేదో తేల్చనున్నారు. వానాకాలం సీఎంఆర్‌ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో ఫిజికల్‌ వెరిఫికేషన్‌ పూర్తయి, అక్రమాలు లేవని తేలేంత వరకు బియ్యాన్ని సేకరించకూడదని ఎఫ్‌సీఐ నిర్ణయించుకుంది. ఇక నుంచి బియ్యం సేకరించేటప్పుడు బియ్యం ఎప్పటివో (ఎంత పాతవో) తేల్చే పరీక్షలు నిర్వహించాలని కూడా అధికారులకు ఎఫ్‌సీఐ ఆదేశాలు ఇచ్చింది. కాగా రైస్‌ మిల్లుల్లో జరిగే తనిఖీలకు అధికార యంత్రాంగం సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు సూచించింది. 

జిల్లాల్లో తనిఖీలు సాగాయిలా...
– ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో 3, ఖమ్మంలో 2, కొణిజర్ల 1, ఖమ్మం రూరల్‌లో 1, వైరాలో 3 మిల్లుల్లో తనిఖీలు జరిగాయి. జిల్లాలో మొత్తం 56 మిల్లులు ఉండగా 10 మిల్లుల నిర్వాహకులు ధాన్యం కేటాయింపునకు అనుగుణంగా సీఎంఆర్‌ బియ్యం ఇచ్చే సమయంలో ఆలస్యం చేస్తున్నట్టుగా తేలిందని సమాచారం. 
– మంచిర్యాల జిల్లాలో నస్పూర్, కిష్టంపేట, చెన్నూరు, కత్తెర శాల, ఆస్నాద్‌ శివారు రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు, మిల్లుల సామర్థ్యం, ట్రక్‌ షీట్లు తదితర వివరాలు పరిశీలించారు. గత మార్చి నెలలో జరిపిన తనిఖీల్లో జిల్లాలో ఎక్కడా ధాన్యం, బియ్యం సరఫరాలో తేడాలు గుర్తించలేదు. తాజా తనిఖీల్లో మాత్రం కొన్ని మిల్లుల్లో ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వలకు సంబంధించి స్వల్ప తేడా గుర్తించినట్లు సమాచారం.
 – జోగుళాంబ గద్వాల జిల్లా లోని అయిజ పట్టణంలోని రైస్‌ మిల్లులను ఎఫ్‌సీఐ మేనేజర్లు కృష్ణమోహన్‌ , వెంకట సాయిరాం సివిల్‌ సప్లయిస్‌ అధికారి నరసింహారావు తనిఖీ చేశారు. దీనికి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు.
– మహబూబాబాద్‌ జిల్లాలోని రైస్‌ మిల్లుల్లో నిల్వలను ఎఫ్‌సీఐ అధికారులు భీమ్లా నాయక్, శ్రీనివాస్‌ నాయక్‌ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. నర్సింహులపేట మండలం పెద్దనాగారం శ్రీ శ్రీ పారాబాయిల్డ్‌ మిల్లు, మరిపెడ మండలంలోని ఎల్లంపేట లక్ష్మీ పారాబాయిల్డ్‌ మిల్లులో ఉన్న ధాన్యం, బియ్యం నిల్వలు, ఎఫ్‌సీఐకి పంపాల్సిన సీఎంఆర్‌ వివరాలు పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.
– జగిత్యాల జిల్లాలో నాలుగు బృందాలుగా ఎఫ్‌సీఐ అధికారులు రైస్‌మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, నిడమనూరు, నకిరేకల్, చిట్యాలతో పాటు సూర్యాపేట జిల్లా కోదాడలోని పలు మిల్లులో తనిఖీలు కొనసాగాయి.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top