రైతుల ఆత్మహత్యలు తగ్గాయి

Telangana Farmer Suicides Have Dropped Said Taraka Rama Rao KTR - Sakshi

మంత్రి కె.తారక రామారావు 

దేశంలోనే తెలంగాణ పత్తి నాణ్యమైంది... రాష్ట్రంలో మరమగ్గాలను ఆధునీకరిస్తాం 

గార్మెంట్‌ రంగంలో మహిళలకు మంచి ఉపాధి అవకాశాలు 

కరోనా కష్టకాలంలో నేతన్నలకు రూ.110 కోట్ల సాయం చేశాం 

సిరిసిల్లలో గోకుల్‌దాస్‌ అపెరల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన 

సిరిసిల్ల: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని.. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు శివారులోని అపెరల్‌ పార్క్‌లో శుక్రవారం మంత్రి, గోకుల్‌దాస్‌ ఇమేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అపెరల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ముందుచూపుతోనే రాష్ట్రం అనేక రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు. జౌళి రంగం అభివృద్ధికి తెలంగాణ టెక్స్‌టైల్స్‌ అండ్‌ అపెరల్‌ పాలసీ(టీ–టాప్‌) తెచ్చామని తెలిపారు.

వరంగల్‌ కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో 12 వేల మందికి ఉపాధి కల్పించేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. అలాగే సిరిసిల్లలో 60 ఎకరాల్లో నెలకొల్పిన అపెరల్‌ పార్క్‌ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. బీడీలు చేస్తూ రె క్కలు ముక్కలు చేసుకునే మహిళలకు సులభంగా నెలకు రూ.10 వేలనుంచి రూ.12 వేలు సంపాదించుకునేందుకు గార్మెంట్‌ పరిశ్రమలు దోహదపడతాయని స్పష్టం చేశారు. సిరిసిల్ల వస్త్రాలు ప్రపంచ విపణిలో పోటీ పడతాయని, నాణ్యమైన, నవ్యమైన వస్త్రాలకు సిరిసిల్ల కేంద్ర బిందువు అవుతుందని పేర్కొన్నారు. 

మన పత్తి ఎంతో నాణ్యమైంది 
దేశంలోనే తెలంగాణ పత్తి ఎంతో నాణ్యమైందని, ఈ విషయాన్ని దక్షిణ భారత స్పిన్నింగ్‌ మిల్లుల సంఘమే ప్రకటించిందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం నేతన్నల బీమా పథకాన్ని అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని గుర్తు చేశారు. రైతుల తరహాలో నేతకార్మికులు ఏ కారణాలతో చనిపోయినా.. వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందేలా బీమా పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. కరోనా కష్ట కాలంలోనూ నేతన్నకు చేయూత పథకం ద్వారా రాష్ట్రంలో 26 వేల మంది కార్మికులకు రూ.110 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు. కాగా, సిరిసిల్లలో రూ.400 కోట్లతో చేపట్టిన వర్కర్‌ టు ఓనర్‌ పథకం కొద్ది రోజుల్లో కార్యరూపం దాలుస్తుందన్నారు.  

మహిళల ఉపాధికి ప్రాధాన్యం: శైలజారామయ్యర్‌ 
అపెరల్‌ పార్క్‌లో మహిళల ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామని రాష్ట్ర జౌళి శాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల అపెరల్‌ పార్క్‌లో రూ.20 కోట్లతో రోడ్లు, షెడ్లు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేశామన్నారు. ఇన్నర్‌వేర్‌ గార్మెంట్‌ పరిశ్రమకు ఇప్పటికే శంకుస్థాపన చేశామని ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మంది మహిళలకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. గోకుల్‌దాస్‌ కంపెనీ ఎండీ సుమీర్‌ హిందుజా మాట్లాడుతూ మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్, టీఎస్‌ఐఐసీ ఎండీ ఇ.వెంకట నర్సింహారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top