
పెదకూరపాడు/మాదల(ముప్పాళ్ళ): అప్పుల బాధ తట్టుకోలేక పల్నాడు జిల్లాలో ఇద్దరు కౌలురైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడుకు చెందిన అడపాల మహేష్బాబు (28) ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని కొన్నేళ్లుగా సాగు చేస్తున్నాడు. వ్యవసాయం కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో అప్పులు తీర్చేదారి లేక ఆదివారం పురుగుమందు తాగాడు. అనంతరం కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు అతడిని సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
గిట్టుబాటు ధర లభించక...
పల్నాడు జిల్లా మాదలకు చెందిన యర్రంశెట్టి కోటేశ్వరరావు(47) 20 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. గత ఏడాది 12 ఎకరాల్లో మిరప, 8 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించపోడంతో తీవ్రంగా నష్టపోయాడు. అప్పులిచి్చనవారి ఒత్తిడి తట్టుకోలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కోటేశ్వరరావుకు రూ.40 లక్షల వరకూ అప్పు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు.