మూకుమ్మడిగా పదోన్నతులు రద్దు 

Telangana Electricity Employees Demotion Promotions - Sakshi

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు షాక్‌ 

కొత్త సీనియారిటీతో మళ్లీ పదోన్నతులు  

250 మందికి డిమోషన్లు 

ఏపీ నుంచి వచ్చిన సీనియర్లకు పదోన్నతుల్లో లబ్ధి 

అసంతృప్తిలో తెలంగాణ విద్యుత్‌ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు భారీ షాక్‌. పలువురు చీఫ్‌ ఇంజనీర్లు డబుల్‌ డిమోషన్‌ పొంది డివిజనల్‌ ఇంజనీర్‌/ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా మారిపోయారు. మరికొందరు సూపరింటెండింగ్‌ ఇంజనీర్లు డబుల్‌ డిమోషన్‌తో అదనపు డివిజనల్‌ ఇంజనీర్‌ స్థాయికి పడిపోయారు. దాదాపు 250 మంది తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు గతంలో పొందిన ఒకటి లేదా రెండు పదోన్నతులను కోల్పోయి తీవ్రంగా నష్టపోయారు.

తెలంగాణ వచ్చాక ఇక్కడి విద్యుత్‌ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని రకాల పదోన్నతులను మంగళవారం తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ సంస్థల యాజమాన్యాలు మూకుమ్మడిగా రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల అమల్లో భాగంగా రాష్ట్ర విభజనకు ముందు 2014 జూన్‌ 1 నాటి సీనియారిటీ జాబితాల ఆధారంగా మళ్లీ కొత్తగా పదోన్నతులు కల్పి స్తూ ఆ వెంటనే వేరే ఉత్తర్వులూ జారీ చేశారు.

తెలంగాణ ఉద్యోగులతోపాటు ఏపీ నుంచి వచ్చిన దాదాపు 700 మందితో రూపొందించిన సీనియారిటీ జాబితాను ఇందుకు వినియోగించారు. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో అధిక మంది సీనియర్లే ఉండటంతోపాటు రిజర్వేషన్లకు సంబంధించిన రోస్టర్‌ పాయింట్లను అమలు చేయడంతో పదోన్నతుల్లో అధిక శాతం ఉన్నతస్థాయి పోస్టులను వారికే కేటాయించినట్టు తెలంగాణ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో కొందరు ఉద్యోగులకు డబుల్‌ ప్రమోషన్లు రాగా, తెలంగాణ వారికి డబుల్‌ డిమోషన్లు లభించినట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కొత్త పదోన్నతుల్లో దాదాపు 250 మంది తెలంగాణ ఇంజనీర్లు, అకౌంట్స్, పీఅండ్‌జీ విభాగాల అధికారులు, ఉద్యోగులు గతంలో పొందిన పదోన్నతులను నష్టపోయారు. సీఈలు ఎస్‌ఈలు/డీఈలుగా, ఎస్‌ఈలు డీఈలు/ఏడీఈలుగా, డీఈలు ఏడీఈలు/ఏఈలుగా రివర్షన్లు పొందినట్టు విద్యుత్‌ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.

నలుగురు సీఈలు, 30 మందికి పైగా ఎస్‌ఈలు, 120 మంది డీఈల పదోన్నతులు రద్దైనట్టు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. దీంతోపాటు కొత్త సీనియారిటీ జాబితాల్లో చాలామంది తీవ్రంగా వెనకబడిపోవడంతో మళ్లీ పదోన్నతులు పొందకుండా రిటైర్‌ కావాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారని సంఘాల నేతలు తెలిపారు.  

‘కరెంట్‌’ రఘుకి డిమోషన్‌ 
తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమ కాలంలో చురుకుగా వ్యవహరించిన ‘కరెంట్‌’ రఘు సైతం ట్రాన్స్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ (సివిల్‌) స్థాయి నుంచి రెండు హోదాలు తగ్గి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా కొత్త పోస్టింగ్‌ పొందినట్టు తెలిసింది.  

నేటి ముట్టడి రద్దు 
తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల పదోన్నతు ల రద్దును, కేంద్రం తెస్తున్న విద్యుత్‌ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం విద్యుత్‌ సౌధను ముట్టడిని ఉపసంహరించుకున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్‌.శివాజీ తెలిపారు. సమస్యను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఉద్యోగులకు న్యాయం చేస్తామని మంత్రి జి.జగదీశ్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళనలను విరమించుకున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top