సదా ఈ–సేవలో.. విద్యుత్‌ ఫిర్యాదులూ ఆన్‌లైన్‌లోనే!

Telangana Electricity Consumers Have The Facility To Complaints Online - Sakshi

త్వరలోనే మొబైల్‌ యాప్‌ కూడా అందుబాటులోకి.. 

నిర్దేశిత గడువులోగా పరిష్కరించకుంటే డిస్కంలకు జరిమానాలు 

ఈఆర్సీ చైర్మన్‌ శ్రీరంగారావు వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: వినియోగదారులు తమ విద్యుత్‌ కనెక్షన్లు, అంతరాయాలు, బిల్లులు, మరమ్మతులు, ఇతర అంశాల్లో సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఫిర్యాదుల స్వీకరణ కోసం ‘కన్జ్యూమర్స్‌ గ్రివెన్సెస్‌ రిడ్రెస్సల్‌ ఫోరం (సీజీఆర్‌ఎఫ్‌)’వెబ్‌పోర్టల్‌ను రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్‌ టి.శ్రీరంగారావు సోమవారం ఆవిష్కరించారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. వినియోగదారులు విద్యుత్‌ సమస్యలపై ఎక్కడి నుంచైనా మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించామని శ్రీరంగారావు చెప్పారు. అయితే వినియోగదారులు తొలుత తమ సమస్యలపై స్థానిక కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌(సీఎస్‌సీ)లో ఫిర్యాదు చేసి రశీదు తీసుకోవాలన్నారు. నిర్దేశిత గడువులోగా సమస్య పరిష్కారం కాకుంటే.. సీజీఆర్‌ఎఫ్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. వాటిని పరిష్కరించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపారు. సీజీఆర్‌ఎఫ్‌లో సైతం పరిష్కారం కాని అంశాలపై విద్యుత్‌ అంబుడ్స్‌మెన్‌కుగానీ, ఈఆర్సీకి గానీ ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. 

సమస్య ఏదైనా సరే.. 
మీటర్లు మొరాయించడం/కాలిపోవడం/సరిగ్గా పనిచేయకపోవడం, కొత్త విద్యుత్‌ కనెక్షన్‌ జారీ/అదనపు లోడ్‌ అనుమతిలో జాప్యం, సర్వీస్‌ కనెక్షన్‌ యజమాని పేరు మార్పు, కేటగిరీ మార్పు, తప్పుడు మీటర్‌ రీడింగ్, అడ్డగోలుగా బిల్లులు, అసలు బిల్లులు జారీ కాకపోవడం, బిల్లుల చెల్లింపు తర్వాత కనెక్షన్‌ పునరుద్ధరణ, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు, తీగలు తెగిపడిపోవడం, వోల్టేజీలో హెచ్చుతగ్గులు వంటి అంశాలపై పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని శ్రీరంగారావు తెలిపారు. ఫిర్యాదులు, వాటిపై సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్, సభ్యులు తీసుకున్న చర్యలకు సంబంధించిన సమస్త సమాచారం పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామన్నారు.

వినియోగదారులు విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం) వెబ్‌సైట్‌లో ఉండే సీజీఆర్‌ఎఫ్‌ లింక్‌ను క్లిక్‌ చేస్తే ఫిర్యాదుల పోర్టల్‌ ఓపెన్‌ అవుతుందని తెలిపారు. లేకుంటే.. ఉత్తర తెలంగాణ జిల్లాల వినియోగదారులు 210.212.223.83:9070/CGRF/CgrfWebsite.jsp పోర్టల్‌లో.. దక్షిణ తెలంగాణ జిల్లాలవారు 117.239.151.73:9999/CGRF/ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. నిర్దేశిత గడువులోగా డిస్కంలు ఫిర్యాదులను పరిష్కరించడంలో విఫలమైతే.. వాటిపై జరిమానాలు విధించే అధికారం తమకు ఉందని తెలిపారు. సీజీఆర్‌ఎఫ్‌ ఫిర్యాదుల స్వీకరణకు త్వరలో మొబైల్‌ యాప్‌ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top