తెలంగాణ: లాక్‌డౌన్‌ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే

Telangana: DGP Mahender Reddy Official Review On Lockdown - Sakshi

ఉల్లంఘించిన వారిపై కేసులు: డీజీపీ 

వ్యవసాయం, వివాహాలకు షరతులతో అనుమతి 

అత్యవసర సేవలు, ప్రయాణాలకు పాస్‌లు జారీ 

ఎస్పీలు, సీపీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీని అమలుపై రేంజ్‌ ఐజీలు, డీఐజీలు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్‌ డీజీ జితేందర్‌ పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ.. సీనియర్‌ పోలీస్‌ అధికారులందరూ క్షేత్ర స్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్‌క్వార్టర్లు, ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాపై ఎలాంటి ఆంక్షల్లేవని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రవాణాపై కూడా ఎలాంటి ఆంక్షల్లేవని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు లేదా గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. 

వ్యవసాయ, గ్రామీణ ఉపాధికి మినహాయింపు.. 
గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధి హామీ పనులను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల వద్ద శాఖాపరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరు వైపుల వారు 40 మంది మాత్రమే హాజరయ్యేలా చూడాలని చెప్పారు. వివాహాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలన్నారు. కరోనా వాక్సినేషన్‌కు ఎవరైనా వెళ్లాల్సి వస్తే వారి మొదటి డోస్‌కు సంబంధించిన సమాచారం సెల్‌ఫోన్‌లో చూసి వెళ్లనివ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులు జారీ చేయాలని సూచించారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేయాలని డీజీపీ పోలీస్‌ అధికారులకు స్పష్టం చేశారు.  

ఈ–పాస్‌ ద్వారా ప్రత్యేక పాసులు 
లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ–పాస్‌ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ–పాస్‌ల కోసం htt p://policeportal.tspolice.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులు జారీచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలు మాత్రమే పాస్‌లు జారీ చేస్తారని వివరించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాస్‌లు జారీ చేస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక కమిషనరేట్‌ నుంచి మరో కమిషనరేట్‌ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్‌ నుంచే పాసులు జారీ చేస్తారని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని ఉద్ఘాటించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి పాసులు అవసరం లేదని, వారి ప్రయాణ టికెట్లు చూపిస్తే సరిపోతుందని తెలిపారు.   

చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా

చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top