వైద్యపరీక్షల్లో జాప్యానికి ‘రిపేర్‌’ 

Telangana Department Of Health Issuing Orders On Repair Of Medical Equipment - Sakshi

ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాల మరమ్మతులకు ప్రత్యేక విధానం 

నాలుగు కేటగిరీలుగా పరికరాలు.. నిర్వహణ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ 

రిపేర్ల ధరల ఖరారు కోసం ప్రత్యేక కమిటీ 

ఉత్తర్వులు జారీ చేసిన వైద్యారోగ్య శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వాస్పత్రుల్లోని వైద్య పరికరాల మరమ్మతుల్లో  జాప్యాన్ని నివారించేందుకు వైద్యారోగ్యశాఖ కొత్త విధానం తీసుకొచ్చింది. పరికరాలన్నింటినీ 4 కేటగిరీ లుగా విభజించి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సాయంతో మరమ్మతుల నిర్వహణను పర్యవేక్షించనుంది. రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనితో ప్రభుత్వాస్పత్రుల్లో పరికరాలకు త్వరగా మరమ్మతులు పూర్తయి.. వైద్య పరీక్షలకు ఇబ్బందులు తప్పనున్నాయి. 

నాలుగు కేటగిరీలుగా చేసి.. 
కొత్త విధానంలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఉన్న వైద్య పరికరాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. రూ.5 లక్షలకుపైన విలువ ఉండి వ్యారంటీ కలిగి ఉన్నవి, సమగ్ర వార్షి క నిర్వహణ ఒప్పందం ఇంకా ప్రారంభంకాని పరికరాలను ఏ కేటగిరీగా.. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి కంపెనీ మెయింటెనెన్స్‌ అవసరమున్నవి, వ్యారంటీ పీరియడ్‌ తర్వాత నిర్వహణ ఒప్పందం చేసుకోవాల్సిన పరికరాలను బీ కేటగిరీగా.. రూ.5 లక్షలకుపైగా విలువ ఉండి ఏడేళ్లు దాటిన పరికరాలు, వ్యారంటీ సహా ఒప్పందం పూర్తయినా ఇంకా పనిచేస్తున్న పరికరాలను సీ కేటగిరీగా.. రూ.5 లక్షల కన్నా తక్కువ విలువైన పరికరాలను డీ కేటగిరీలో చేర్చారు. ఇందులో ఏ, బీ, సీ కేటగిరీ పరికరాల నిర్వహణ బాధ్యతను టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీకి అప్పగించారు. డీ కేటగిరీలోని పరికరాల నిర్వహణను ఆయా ఆస్పత్రులు చూసుకుంటాయి. 

ప్రత్యేక వ్యవస్థ, సాఫ్ట్‌వేర్‌ 
వైద్య పరికరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీలో ప్రోగ్రామ్‌ మేనేజెంట్‌ యూనిట్‌ (పీఎంయూ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశారు. నిర్వహణ కోసం టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ ఆధ్వర్యంలో మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ మెయింటెనెన్స్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (ఎంఈఎంఐఎస్‌) పేరుతో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్లు వైద్య పరికరాలకు అవసరమైన మరమ్మతుల ప్రతిపాదనలను ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పంపుతారు.

వాటిని టీఎస్‌ఎంఎస్‌ఎస్‌ఐడీసీ పరిశీలించి, మరమ్మతులు చేయిస్తుంది. ఇందులో సీ కేటగిరీలోని పరికరాల మరమ్మతుల ధరలను ఖరారు చేసేందుకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ మెంబర్‌ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, వైద్యారోగ్యశాఖ సాంకేతిక సలహాదారు సభ్యులుగా ఉంటారు. ఏటా ఒక్కోబెడ్‌కు పీహెచ్‌సీలకు రూ.వెయ్యి, సీహెచ్‌సీలకు రూ.1,500, ఏరియా, జిల్లా ఆస్పత్రులకు రూ.2 వేలు, బోధన, స్పెషాలిటీ ఆస్పత్రులకు రూ.2,500 చొప్పున నిధులు విడుదల చేస్తారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top