ఇక పరీక్షలన్నీ సకాలంలోనే..

Telangana Degree Exams Will Held In June - Sakshi

ఆగస్టులో పీజీ సెట్‌.. మేలో నోటిఫికేషన్‌

జూన్‌లో డిగ్రీ కోర్సులకు పరీక్షలు

‘న్యాక్‌’పై ప్రత్యేక అవగాహన.. వీసీల భేటీలో నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశం పొందేందుకు రాష్ట్ర విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సకాలంలో పరీక్షలు పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. అలాగే రాష్ట్ర యూనివర్సిటీల్లో జాతీయ, అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశాన్ని పెంచే చర్యలు చేపట్టనుంది. ఆరు యూనివర్సిటీల ఉపకులపతులతో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కేంద్ర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సెలింగ్‌ ఆగస్టులోనే నిర్వహిస్తుండగా ఇందులో సీటు పొందాలనుకొనే విద్యార్థులకు రాష్ట్రంలో సకాలంలో తుది సెమిస్టర్‌ పూర్తికాక అవకాశం కోల్పోతున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని జూన్‌ చివరి నాటికే డిగ్రీ కోర్సుల తుది సెమిస్టర్‌ పరీక్షలు పూర్తి చేయాలని తీర్మానించామన్నారు. ఇందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిపారు. 

మేలో పీజీ నోటిఫికేషన్‌..
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని, ఈ బాధ్యతను ఓయూ తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. పీజీ సెట్‌కు మేలో నోటిఫికేషన్‌ ఇచ్చి ఆగస్టులో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అన్ని విశ్వవిద్యాలయాలతో ఉన్నత విద్యామండలి సమన్వయం చేసుకుంటుందని ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. అఖిల భారత సర్వే కోసం అవసరమైన డేటాను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్‌ చేయాలని వీసీలకు సూచించారు.

‘న్యాక్‌’ స్పీడ్‌ పెంచాలి..
రాష్ట్రంలో ఎక్కువ విద్యాసంస్థలు నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకొనేలా ప్రోత్సహించాలని, దీని కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని వీసీల సమావేశంలో నిర్ణయించారు. అలాగే గుర్తింపు కాలపరిమితి తీరిన కాలేజీలను తిరిగి దరఖాస్తు చేయించడం, గుర్తింపు ఉన్న కాలేజీల స్థాయి పెంపునకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ వి. వెంకటరమణ, వర్సిటీల వీసీలు రవీందర్, రవీంద్రగుప్తా, గోపాల్‌రెడ్డి, రమేశ్, రాథోడ్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top