Congress Party Chalo Rajbhavan: ఉద్రిక్తంగా చలో రాజ్‌భవన్‌.. పోలీసుల సీరియస్‌

Telangana Congress Party Chalo Rajbhavan Tension Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాహుల్‌ ఈడీ విచారణ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాంగ్రెస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. పోలీసులను కూడా పెద్ద సంఖ్యలో మొహరించారు. కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఖైరతాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్‌ నేతలు రాజ్‌భవన్‌ వైపు దూసుకెళ్లారు. దీంతో రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

ఎస్సై చొక్కా పట్టుకున్న రేణుకా చౌదరి
కాంగ్రెస్‌ తలపట్టిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో పోలీసులు రేణుకాచౌదరిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమెకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రేణుకా చౌదరి ఎస్సై కాలర్‌ పట్టుకున్నారు. అయితే పోలీసులు ఆమెను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

కాంగ్రెస్ రచ్చపై పోలీసుల సీరియస్ 
కాంగ్రెస్‌ ఆందోళనపై పోలీసులు సీరియస్‌ అయ్యారు. డీసీపీ జోయల్ డేవిస్ చొక్కా పట్టుకున్న భట్టి విక్రమార్క, ఎస్‌ఐ  కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి సహా పలువురు కాంగ్రెస్‌ నేతలపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. 

రణరంగంగా మారిన ఖైరతాబాద్‌
రేవంత్‌రెడ్డి రోడ్డుపై బైఠాయించడంతో కాంగ్రెస్‌ చేపట్టిన చలో రాజ్‌భవన్‌ ఉద్రిక్తంగా మారింది. ఖైరతాబాద్‌ చౌరస్తాలో కాంగ్రెస్‌ శ్రేణులు బైక్‌కు నిప్పుపెట్టి నిరసనకు దిగారు. బస్సుల రాకపోకలను కూడా అడ్డుకున్నారు. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు పట్ల దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి సహా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.

భారీగా ట్రాఫిక్‌ జామ్‌
రాహుల్‌ గాంధీపై ఈడీ విచారణకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ చేపట్టిన చలోరాజ్‌భవన్‌ ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్‌కు వెళ్లే ఇరువైపులా రోడ్లను మూసివేయడంతో ఖైరతాబాద్‌ జంక్షన్‌లో భారీ ట్రాఫిక్‌ జాం అయింది. ఖైరతాబాద్‌-పంజాగుట్ట రూట్‌లో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. బేగంపేట మార్గంలోనూ ట్రాఫిక్‌ జాం అయింది. పోలీసులు ట్రాఫిక్‌ను రాజ్‌భవన్‌ రూట్‌లోకి అనుమతించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top