హైదరాబాద్‌కు మరో మాస్టర్‌ ప్లాన్‌ | Telangana: Congress BJP Leaders Had Earlier Promised To Revoke GO 111: KTR | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు మరో మాస్టర్‌ ప్లాన్‌

Apr 30 2022 3:32 AM | Updated on Apr 30 2022 11:49 AM

Telangana: Congress BJP Leaders Had Earlier Promised To Revoke GO 111: KTR - Sakshi

షోలో భవనం నమూనాను పరిశీలిస్తున్న కేటీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: మహానగరం రోజురోజుకు విస్తరిస్తున్న వేళ సరికొత్త మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేయాల్సిన ఆవశ్యత ఉందని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వచ్చే 25–30 ఏళ్ల హైదరాబాద్‌ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తామన్నారు. అంతర్జాతీయ ఏజెన్సీతో వచ్చే 18 నెలల్లో దీనికి రూపకల్పన జరుగుతుందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 2012–13లో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ ఇప్పటి హైదరాబాద్‌ విస్తరణకు ఏమాత్రం సరిపోవటం లేదని, అందులో కొన్ని తప్పులున్న మాట కూడా వాస్తవేనని అన్నారు.

అలాగే111 జీవో పరిధిలో పర్యావరణహితమైన మాస్టర్‌ను ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పారు. హెచ్‌ఐసీసీలో శుక్రవారం జరిగిన క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రాపర్టీ షోలో ఆయన మాట్లాడారు. 111 జీవో పరిధిలో 1.32 లక్షల ఎకరాల భూములున్నాయని, 135 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని..ఇక్కడ సమాంతర అభివృద్ధి జరిగేలా మాస్టర్‌ ప్లాన్‌ను క్రోడీకరిస్తామని వివరించారు. అలాగే ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్త మాస్టర్‌ ప్లాన్‌లను అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 

కార్మికులకు నైపుణ్య శిక్షణ కేంద్రం..
వలసలను నివారించేందుకు..భవన నిర్మాణ కార్మికులకు ఇక్కడే ఉపాధి లభించేందుకు డెవలపర్లు చొరవ తీసుకోవాలని సూచించారు. కార్మికులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ అందించాలని, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శిక్షణ అనంతరం జాబ్‌ గ్యారంటీ అనే నమ్మకాన్ని కలిగిస్తే విదేశాల్లో ఉన్న మన యువత తిరిగి వస్తారని చెప్పారు. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిద్దామని తెలిపారు.

మరో 300 మిలియన్‌ గ్యాలన్ల నీటి లభ్యత
27 శాతం హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను ఉస్మాన్‌ సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలు తీరుస్తున్నాయి. అయితే గోదావరి, కృష్ణాతో ప్రస్తుతం ఈ జలాశయాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని చెప్పారు. వీటి నుంచి మిలియన్‌ గ్యాలన్ల నీటిని కూడా వాడుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం 600 పైగా మిలియన్‌ గ్యాలన్ల నీటి లభ్యత ఉంది. గుండ్లపోచంపల్లి, మల్లన్నసాగర్‌లతో త్వరలోనే మరో 300 మిలియన్‌ గ్యాలన్ల నీరు అందుబాటులోకి రానుందని కేటీఆర్‌ వివరించారు. దీంతో ప్రతి ఇంటికీ ఇంకా ఎక్కువ గంటలు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణలో మనం దేశంలోనే ముందుంటామని అన్నారు.

ఒక్క చోటే ఉండొద్దు..
నగరం నలువైపులా గృహ సముదాయాలను విస్తరించాలని, ఒక్క ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకూడదని కేటీఆర్‌ సూచించారు. ఒకర్ని చూసి ఒకరు గొర్రెల మందలాగా ఒకేచోట స్థిరపడిపోతున్నారు. హైదరాబాద్‌లో పశ్చిమం వైపు మాత్రమే కాకుండా నలువైపులా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన జరుగుతోంది. వీటిని డెవలపర్లు వినియోగించుకోవాలన్నారు.  

ఔటర్‌ లోపల 148 లింక్‌ రోడ్లు, 19 ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లున్నాయని.. ఆయా ప్రాంతాలలో సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పెరిగిందని కేటీఆర్‌ చెప్పారు. వీటి చుట్టూ హౌసింగ్‌ కాలనీలు, స్కూళ్లు, ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్స్‌ను డెవలప్‌ చేయాలని బిల్డర్లుకు సూచించారు. కొత్త ఏరియాలలో గృహ నిర్మాణాలను ప్లాన్‌ చేయాలన్నారు. వచ్చే 10–15 ఏళ్ల పాటు హైదరాబాద్‌ గృహ నిర్మాణ రంగానికి ఢోకా లేదని స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్‌ చార్జీలు తగ్గించాలి
ఓఆర్‌ఆర్‌ చుట్టూ 5–6 క్లస్టర్లను ఏర్పాటు చేసి డెవలపర్లకు తక్కువ ధరకు భూములను కేటాయించాలని క్రెడాయ్‌ హైదరాబాద్‌ జనరల్‌ సెక్రటరీ వి.రాజశేఖర్‌ రెడ్డి కోరారు. దీంతో ఆయా ప్రాంతాలలో రూ.50–60 లక్షల లోపు ధర ఉండే అందుబాటు, మధ్యస్థాయి గృహాలను నిర్మిస్తామని, దీంతో సామాన్యుల సొంతింటి కల మరింత సులువవుతుందని చెప్పారు.

మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలను తగ్గించాలని లేదా కనీసం మహిళ పేరిట రిజిస్ట్రేషన్ల చేసే వారికి, అందుబాటు గృహాల రిజిస్ట్రేషన్‌ చార్జీలను 1–2 శాతం మేర తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, లక్ష్మారెడ్డి, నల్లమోతు భాస్కర్‌ రావు, క్రెడాయ్‌ తెలంగాణ చైర్మన్‌ ఆర్వీ రామచంద్రా రెడ్డి, ప్రెసిడెంట్‌ రామకృష్ణా రెడ్డి, హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement