ఇదేనా సంస్కారం?: బీజేపీపై కేసీఆర్‌ మండిపాటు

Telangana: Cm Kcr Slams Bjp Government In Meeting - Sakshi

రాహుల్‌ను అంత మాట అంటారా?

రాయగిరి సభలో బీజేపీపై కేసీఆర్‌ మండిపాటు

అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్‌ చేయాలి

ఇది మతపిచ్చి ప్రభుత్వం.. దేశానికి పట్టిన దరిద్రం

బెంగళూరు సిలికాన్‌ వ్యాలీని కశ్మీర్‌లా మార్చారు

బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టాలి

ఇందుకోసం తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంకావాలని పిలుపు

యాదాద్రి కలెక్టరేట్, పార్టీ ఆఫీసును ప్రారంభించిన సీఎం

సాక్షి, యాదాద్రి:  కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీపై అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు దారుణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబానికి చెందిన ఎంపీ, జాతీయ పార్టీ ప్రతినిధి పుట్టుకపై వ్యాఖ్యలు చేయడం బీజేపీ సంప్రదాయమా? అని నిలదీశారు. ప్రధాని మోదీకి ఏమాత్రం సంస్కారమున్నా అస్సాం సీఎంను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

ఈ దేశానికి పట్టిన దరిద్రం బీజేపీ అని, దానిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. శనివారం యాదాద్రి జిల్లా నూతన సమీకృత కార్యాలయ సముదాయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. తర్వాత టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం భువనగిరి శివార్లలోని రాయగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. ఇందులోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాహుల్‌గాంధీపై అస్సాం బీజేపీ ముఖ్యమంత్రి  చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయి. ఒక ఎంపీ పార్లమెంట్‌లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా మాట్లాడుతారా? బీజేపీ అధ్యక్షుడు నడ్డా దీనిపై స్పందించాలి. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబానికి చెందిన ఎంపీ, జాతీయ పార్టీ ప్రతినిధిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బీజేపీ సంప్రదాయమా, హిందు ధర్మమా మోదీ చెప్పాలి. రాహుల్‌గాంధీ తాత నెహ్రూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. దేశానికి దీర్ఘకాలం ప్రధానిగా పనిచేశారు. వాళ్ల నాయనమ్మ, నాన్న కూడా ప్రధాన మంత్రులుగా పనిచేసి దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ను ‘నువ్వు ఏ అయ్యకు పుట్టినవో’అని వ్యాఖ్యలు చేస్తారా? ఇలా మాట్లాడడం మర్యాదేనా? ఇది దేశానికి మంచిదేనా? భారతం, రామాయణం మనకు నేర్పింది ఇదేనా మోదీ చెప్పాలి. 

పిచ్చి ముదిరి.. పిచ్చి పాలసీలు.. 
దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి, ప్రధాని మోదీకి పిచ్చి ముదిరి పిచ్చిపిచ్చి పాలసీలు తెస్తున్నారు. వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఏడిపించారు. పోరాటం చేస్తున్న రైతులను ఖలిస్తాన్‌ ఉగ్రవాదులుగా చిత్రీకరించారు. ఉత్తరప్రదేశ్‌ మంత్రి కొడుకు కారుతో గుద్ది రైతులను చంపారు. వందలాది మంది రైతులను బలితీసుకున్న ప్రధాని మోదీ.. చివరికి క్షమాపణలు చెప్పి సాగుచట్టాలను ఉపసంహరించుకున్నారు. రైతుల జోలికి వస్తే అధోగతి పడుతుంది.. తస్మాత్‌ జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లలో ఏ ఒక్క రంగంలోనూ అభివృద్ధి సా«ధించలేదు. జీడీపీ పతనమైంది. ఆరోగ్య రంగం దెబ్బతిన్నది. డబ్బా కొట్టుకోవడం, మంది మీద ఏడ్వడం తప్ప సాధించిందేమీ లేదు. 

నేను ఒప్పుకొంటానా? 
మోదీ సంçస్కరణల పేరుతో రైతుల మెడ మీద మీటర్ల కత్తిపెట్టారు. ఆయన దోస్తుల కరెంట్‌ కొనడానికే దీనిని తెరపైకి తెచ్చారు. సంస్కరణలు అమలు చేస్తేనే డబ్బులు ఇస్తానని పేచీపెట్టారు. నేను ఒప్పుకుంటానా? చచ్చినా కరెంట్‌ సంస్కరణలు అమలు కానివ్వను. రైతులకు అండగా ఉంటా. 

మతపిచ్చి విధానాలతో జీడీపీ తగ్గింది 
బీజేపీ మతపిచ్చి విధానాలతో శాంతిభద్రతలు దెబ్బతిని దేశంలోకి పెట్టుబడులు తగ్గాయి. మోదీ సిగ్గు పడాలి. దేశంలో నిరుద్యోగం పెరుగుతున్నది నిజం కాదా? మోదీ ఫెయిల్యూర్‌ వల్ల 15, 16 లక్షల పరిశ్రమలు దేశంలో మూతపడడం నిజం కాదా? మీ ఉజ్వల పరిపాలనకు ఇది తార్కాణమా? పోలీసు లాఠీచార్జీలు మనకు అవసరమా? ఈ గొడవల వల్ల కడుపు నిండుతదా.. అమెరికాలో మెజార్టీ క్రిస్టియన్లు ఉన్నా ఏనాడూ మత గొడవలు పెట్టుకోలే. ఆ దేశం అభివృద్ధి చెందింది.

ఇవాళ బీజేపీ దమననీతితో దేశం అల్లకల్లోలం అయ్యేలా ఉంది. ఇది బాధ అనిపిస్తోంది. దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉంటే రెండు లక్షల మెగావాట్లే వాడుతరు. ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్‌ ఇవ్వరు. 65 వేల టీఎంసీల నీరుంటే 35వేల టీఎంసీలకు మించి వాడుకోవడం లేదు. నీళ్లు, కరెంట్‌ ఇచ్చే సోయి బీజేపీకి లేదు. ప్రపంచ ఆకలి రాజ్యాల నివేదికలో మన దేశం 101 స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్‌లు మన కంటే మెరుగైన పరిíస్థితిలో ఉన్నాయి. మోదీ తెలివి తక్కువతనం వల్లనే లాక్‌డౌన్‌ పెట్టి ప్రజలను అరిగోస పెట్టించాడు. కరోనా సమయంలో గంగా నదిలో శవాలు తేలడం సిగ్గుచేటు కాదా.. 

ఢిల్లీదాకా పోరాటం చేద్దాం.. 
కేంద్రం, మోదీ తెలంగాణతో ఎందుకు గోక్కుంటున్నారు. కేసీఆర్‌ ఎందుకు భయపడతాడు. దొంగ ఆస్తులు, దొంగ సంపాదన లేదుకదా. నాకు తెలంగాణ ముఖ్యం. చచ్చినా సరే వెనకడుగు వేయను. తెలంగాణ సమాజం బీజేపీ దొంగల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కేసీఆర్‌ ఒక్కడే పోట్లాడుతడా.. అందరూ సిద్ధంగా ఉండాలి. ఢిల్లీ దాకా పోరాటం చేద్దాం. ఇతర రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ, ఉద్ధవ్‌ థాకరే, స్టాలిన్‌ నాతో మాట్లాడారు. ఇంకా కొందరు మాట్లాడుతారు. 

తెలంగాణలో సంపద పెరుగుతోంది... 
పోరాడి తెలంగాణ తెచ్చుకున్నట్లే.. ఇప్పుడు ప్రగతి కోసం ముందుకుపోదాం. తెలంగాణ ధనవంతం అవుతోంది. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఎక్కడా భూముల ధరలు ఎకరానికి రూ.30 లక్షలకు తక్కువ లేవు. మూడెకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడయ్యాడు. నారాయణపేట, మహబూబ్‌నగర్, దేవరకొండ, సంస్థాన్‌ నారాయణపురంలలోనూ ఎకరం భూమి రూ.30 లక్షలకు లభించే పరిస్థితి లేదు. భువనగిరి, యాదాద్రిలో సాధారణ భూములేకాదు గుట్టలు కూడా ఎకరం ధర కోట్లకు చేరింది. ఏమైనా మాయ చేస్తే ఇలా పెరిగాయా? మంత్రివర్గ నిర్ణయాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల మడమ తిప్పని కృషితో తెలంగాణ ఆర్థికశక్తిగా అద్భుతంగా పురోగమిస్తోంది. ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీళ్లు అందుతున్నాయి. ఆసరా పెన్షన్లు, గురుకులాలు, సాగునీరు, నాణ్యమైన 24 గంటల కరెంటు..ఇలా అన్నింటిలో విజయం సాధించాం. దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచాం. 

ఉద్యోగుల సర్వీస్‌రూల్స్‌ సరళీకరించాలి 
ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌ బైండింగ్‌ బుక్‌లా కాకుండా పదోన్నతి, పదవీ విరమణ వంటి ప్రధానమైన అంశాలు ఉంటే చాలు. ఇందుకోసం ఉద్యోగుల సర్వీసు రూల్స్‌ను సరళీకరించాల్సి ఉంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల వారు సీఎస్‌తో సమావేశమై విధివిధానాలు రూపొందించాలి. సర్వీసు రూల్స్‌ మారిస్తే బదిలీలకు, ప్రమోషన్లకు పైరవీలు చేసే బాధ తప్పుతుంది. ఉద్యోగులు చిన్నచిన్న విషయాలకు ఆందోళన బాట పట్టవద్దు. రాష్ట్ర సంక్షేమ రంగంలో ఉద్యోగుల కృషికి ప్రజలపక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నా.  

దేశానికి రోల్‌మోడల్‌ తెలంగాణ: జగదీశ్‌రెడ్డి 
సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమేగాకుండా.. అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని మంత్రి జగదీశ్‌రెడ్డి కితాబిచ్చారు. పరిపాలన ఎలా ఉండాలో దేశానికే రోల్‌ మోడల్‌ గా చూపించారని కొనియాడారు. ఆయన రాయగిరిలో సభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. తెలంగాణలో బీడు భూములను కేసీఆర్‌ సస్యశామలం చేశారని.. మూసీ ఆధునీకరణ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులు పూర్తిచేసి, యాదాద్రికి కాళేశ్వరం నీళ్లను తీసుకొచ్చిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. కాగా.. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, గ్యాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, నోముల భగత్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కర్ణాటకను కశ్మీర్‌ చేశారు 
కేంద్రంలో ప్రగతి ప్రభుత్వం ఉండాలిగానీ మత విద్వేషాలు రేపే ప్రభుత్వం అవసరమా? కర్ణాటకలో ఇవాళ ఏం జరుగుతోందో చూడాలి. సిలికాన్‌ వ్యాలీని కశ్మీర్‌ వ్యాలీ చేశారు. బెంగళూరులో ఆడబిడ్డలపై అలా వ్యవహరించడం సరైనదేనా? దీనికి బీజేపీ మొనగాళ్లు సమాధానం చెప్పాలి. 

నా సంగతి ఏం చూస్తావో చూడు! 
కేసీఆర్‌ సంగతి చూస్తా.. అని మోదీ అంటున్నరు. ఏం చూస్తావో చూడు బిడ్డా. నీ బెదిరింపులకు భయపడేది లేదు. నేను నీ తెరువు రాలేదు.. నువ్వే మా తెరువు వస్తున్నావ్‌. గుర్తు పెట్టుకో.. కేసీఆర్‌ భయపడితే తెలంగాణ వచ్చేదా? దమ్ముంటే బీజేపీ మొగోళ్లు సమా«ధానం చెప్పాలి. వారి చిల్లర వ్యవహారాలు తెలంగాణలో చెల్లవు. 

మరో ఉద్యమానికి సిద్ధం కావాలి 
ఈ దేశానికి పట్టిన దరిద్రం బీజేపీ. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే దేశానికి అంత మంచిది. న్యాయం పక్షాన నిలబడటానికి తెలంగాణ ఎప్పుడూ ముందంజలో ఉంటుంది. కేంద్రంలో మతపిచ్చి మోదీ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రగతికాముక ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఇందుకు తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. బీజేపీని తన్నితన్ని తరిమికొట్టాలి. చెప్పడం నా బాధ్యత, ధర్మం కాబట్టి, ప్రజల్లో ఉన్నాను కాబట్టి ఈ మాట చెప్తున్నా. బీజేపీ దరిద్రపుగొట్టు వ్యవహారం చూడలేక, భరించలేక ఇలా చెప్తున్నానే తప్ప నాది వేరే ఉద్దేశం కాదు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top