చినజీయర్‌ ఆశ్రమానికి కేసీఆర్‌ 

Telangana CM KCR Meets Sri Tridandi Chinna Jeeyar Swamy - Sakshi

సతీసమేతంగా శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని జీవా ప్రాంగణానికి..

యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవంపై చర్చ

నిత్యాన్నదాన సత్రంలో సీఎం సహపంక్తి భోజనం

శంషాబాద్‌ రూరల్‌: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో ఉన్న ఆశ్రమంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం దంపతులను జీయర్‌స్వామి శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సీఎం కేసీఆర్‌ సహపంక్తి భోజనం చేశారు.

ఆ తర్వాత యాద్రాది ప్రారంభోత్సవంపై జీయర్‌ స్వామితో సీఎం కేసీఆర్‌ చర్చించారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్‌ పిలుపు మేరకు ఆశ్రమ ఆవరణలో జీయర్‌స్వామితో కలసి సీఎం కేసీఆర్‌ ఐదు జమ్మి మొక్కలను నాటారు. ‘ఊరు ఊరుకు జమ్మి–గుడి గుడికి జమ్మి’పేరిట ఎంపీ సంతోశ్‌ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని చినజీయర్‌ స్వామి కొనియాడారు.

హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెట్టును జాతీయ స్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్న ఆయనకు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని జీయర్‌స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్‌ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వర్‌రావు, కావేరి సీడ్స్‌ అధిపతి భాస్కర్‌రావు, కలెక్టర్‌ అమెయ్‌ కుమార్, సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, ఆర్డీఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. 

యాద్రాది పర్యటన రద్దు.. 
ముచ్చింతల్‌ నుంచి చినజీయర్‌ స్వామితో కలసి సీఎం కేసీఆర్‌ యాద్రాది వెళ్లాలని నిర్ణయించుకోగా.. జీయర్‌స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నందును సాధ్యపడలేదు. నవంబర్‌ 19 నాటికి స్వామి దీక్ష పూర్తికానుంది. ఆ తర్వాతనే జీయర్‌ స్వామి యాద్రాదిని సందర్శించే అవకాశాలున్నాయి. కార్యక్రమం వాయిదా పడటంతో  సీఎం తిరిగి గజ్వేల్‌లోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. 

జమ్మి మొక్క నాటుతున్న చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్‌. చిత్రంలో ఎంపీ సంతోష్‌కుమార్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top