రాజ్యాంగ పరిరక్షకురాలిగా స్పందించండి 

Telangana: BJP MLAs Complaint To Governor Tamilisai Soundararajan About Suspension - Sakshi

సస్పెన్షన్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు 

సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందిగా స్పీకర్‌కు సూచించాలని వినతి 

హైకోర్టును ఆశ్రయించాలని పార్టీ నేతల నిర్ణయం 

నేడు అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం–కేంద్రం–బీజేపీల మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. సోమవారం అసెంబ్లీలో ఆర్థికమంత్రి వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెడుతుండగా అంతరాయం కలిగిస్తున్నారనే పేరుతో ముగ్గురు బీజేపీ సభ్యులపై సస్పెన్షన్‌ వేటు వేయడం తెలిసిందే. కాగా దీనిపై వారు రాష్ట్ర గవర్నర్‌ డా. తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు సస్పెన్షన్‌ను సవాల్‌ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్రపతికి సైతం ఫిర్యాదు చేయాలని, ఇతర అన్ని వేదికలు, సంస్థలను ఆశ్రయించాలని భావిస్తున్నారు. 

గవర్నర్‌ రాజ్యాంగ బద్ధంగా స్పందిస్తామన్నారు 
తాము సభలో ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకపోయినా సస్పెండ్‌ చేశారంటూ గవర్నర్‌కు ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని, తమ హక్కులను కాలరాస్తూ తమను సస్పెండ్‌ చేసినందున రాజ్యాంగ పరిరక్షకురాలిగా దీనిపై స్పందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాల్సిందిగా స్పీకర్‌కు సూచించాలని కోరారు.

తమకు ఓటేసి గెలిపించిన ప్రజలకు అసెంబ్లీలో తాము ప్రాతినిధ్యం వహించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. కాగా దీనిపై రాజ్యాంగబద్ధంగా స్పందిస్తామని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తామని గవర్నర్‌ తమకు హామీ ఇచ్చారని ఈటల, రఘునందన్‌రావు మీడియాకు తెలిపారు. శాసనసభలో పరిణామాలను గవర్నర్‌కు వివరించామని, గవర్నర్‌ను ప్రసంగించేందుకు పిలవక పోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పామని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరితే తమ ముఖాలు చూడకూడదని సస్పెండ్‌ చేశారని చెప్పారు. గవర్నర్‌ను కలిసిన వారిలో పార్టీ నేతలు డీకే అరుణ, డాక్టర్‌ కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్‌.రామచంద్రరావు, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, డా.జి.మనోహర్‌రెడ్డి ఉన్నారు.  

అసెంబ్లీ జరిగినన్ని రోజులు నిరసనలు 
అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ మంగళవారం అన్ని జిల్లాల్లో అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనేలా చూడాలని భావిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో ఈ మేరకు కార్యాచరణపై సోమవారం ఆర్ధరాత్రి వరకు నేతలు చర్చించారు.

శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యేలను ఎదుర్కోలేక, వారు లేవనెత్తే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక, ఈటల రాజేందర్‌ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టడంతో ఆయన ముఖం చూసే ధైర్యం లేకే ఇలాంటి రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీ దిగుతున్నాయని బీజేపీ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇతర నేతలు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top