కేసీకి 18.51 టీఎంసీలు చాలు! | Telangana arguments before Krishna Tribunal 2 | Sakshi
Sakshi News home page

కేసీకి 18.51 టీఎంసీలు చాలు!

Jul 24 2025 5:22 AM | Updated on Jul 24 2025 5:22 AM

Telangana arguments before Krishna Tribunal 2

మిగిలిన 26.59 టీఎంసీలను మాకు కేటాయించండి 

కృష్ణా ట్రిబ్యునల్‌–2 ఎదుట తెలంగాణ వాదనలు

సాక్షి, హైదరాబాద్‌: ఏపీలోని కర్నూలు–కడప (కేసీ) కాల్వ కింద ఆయకట్టుకి 18.51 టీఎంసీల జలాలే అవసరమని తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది. ఇవిపోగా ఈ కాల్వకు ఉన్న వాస్తవ నీటి లభ్యత 45.1 టీఎంసీల్లో మిగిలిన 26.59 టీఎంసీలను తమ రాష్ట్రానికి కేటాయించాలని జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2కి తెలంగాణ విజ్ఞప్తి చేసింది. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పునః పంపిణీ కోసం విచారణ నిర్వహిస్తున్న ట్రిబ్యునల్‌ బుధవారం ఢిల్లీలో నిర్వహించిన విచారణలో తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది వైద్యనాథన్‌ వాదనలు వినిపించారు. కేసీ కాల్వలకి 39.9 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్‌–1 కేటాయించగా.. నిప్పులవాగు, గాలేరు, కుందు వాగుల నుంచి వచ్చి చేరే మరో 5.2 టీఎంసీలతో కలిపి కాల్వకి మొత్తం నీటి లభ్యత 45.1 టీఎంసీలకు పెరిగిందని ఆయన వివరించారు. 

మరోవైపు ఈ కాల్వ ద్వారా ఏపీ ఏటా సగటున 54 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకుంటోందని అభ్యంతరం తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్‌–1 తీర్పుకి విరుద్ధంగా కేసీ కాల్వలకు సుంకేసుల బరాజ్‌తో పాటుగా ముచ్చుమర్రి, మల్యాల, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌–ఎస్కేప్‌ చానల్‌ అనే మూడు వనరుల నుంచి నీళ్లను తరలించుకుంటున్నారని తప్పుబట్టారు. 

కేసీ కాల్వ కింద పంటల సాగుకు శాస్త్రీయ పద్ధతిలో 18.51 టీఎంసీల జలాలు సరిపోతాయని తెలిపారు. కాగా.. గురు, శుక్రవారాల్లో కూడా ట్రిబ్యునల్‌ ఎదుట తెలంగాణ తన వాదనలు వినిపించనుంది.  
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement