అంగన్‌వాడీలకు ‘అద్దె’ కష్టాలు

Telangana Anganwadi Centers Not Receiving Rents From Past One And Half Years - Sakshi

ఏడాదిన్నరగా అద్దె నిధులు విడుదల చేయని ప్రభుత్వం 

దీంతో పేరుకుపోయిన బకాయిలు రూ.30 కోట్లకు పైమాటే 

అద్దె ఇవ్వకపోవడంతో ఖాళీ చేయాలంటూ యజమానుల ఒత్తిడి 

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కష్టాలు పెరిగిపోతున్నాయి. ఏడాదిన్నరగా ప్రభు త్వం అద్దె నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు కుప్పలుగా పేరుకుపోయాయి. బకాయి లు చెల్లించాలంటూ యజమానుల నుంచి ఒత్తిడి రావడంతో స్థానిక అంగన్‌వాడీ టీచర్లు సతమతమవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో 12,400 కేంద్రాలు అద్దె భవనాల్లోనే.. 11,181 కేంద్రాలు శాశ్వత భవనాల్లో.. 12,119 కేంద్రాలు ప్రాథమిక పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లలో కొన సాగుతున్నాయి.

అద్దె భవనాలను రెండు రకాలుగా వర్గీకరించిన ప్రభుత్వం ఆ మేరకు అద్దె నిధులు చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో రూ.వెయ్యి చొప్పున, పట్టణ ప్రాంతంలో గరిష్టంగా రూ.3 వేల చొప్పున సీలింగ్‌ విధించి నిధులు విడుదల చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె కింద నెలకు సగటున రూ.2.5 కోట్లు సగటున చెల్లిస్తోంది. గత ఏడాదిన్నరగా అద్దె నిధులు విడుదల చేయకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. గతేడాది డిసెంబర్‌ నాటికి రూ.30 కోట్ల మేర అద్దె బకాయిలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

టీచర్లపై ఒత్తిడి... 
అంగన్‌వాడీ కేంద్రం కోసం అద్దె భవనాన్ని పరిశీలించి, ఖరారు చేయడం, నెలవారీగా అద్దె మొత్తాన్ని చెల్లించే ప్రక్రియంతా టీచర్ల పరిధిలోనే కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం అద్దె బకాయిలు చెల్లించకపోవడంతో యజమానులు టీచర్లపై ఒత్తిడి చేస్తున్నారు. బకాయిలు చెల్లించకుంటే ఖాళీ చేయాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అద్దె రూపంలో ఇచ్చే మొత్తం నామమాత్రమే అయినా సకాలంలో ఇవ్వకపోవడం వారికి ఇబ్బందికరంగా మారుతోంది. దీంతో ప్రత్యామ్నాయ భవనాల కోసం ప్రయత్నాలు చేయాల్సి వస్తోందని కొందరు టీచర్లు వాపోతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top