అక్షరాలా లక్ష కోట్లు

Telangana Agriculture Production One Lakh Crores - Sakshi

2020–21లో వ్యవసాయ ఉత్పత్తి అంచనా

వ్యవసాయ, ఉద్యాన పంటలన్నీ కలిపి నిర్ధారణ

2019–20లో 89,058 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అదే స్థాయిలో పంట దిగుబడులూ గణనీయంగా పెరుగుతున్నాయి. కాలం కలిసి రావడం, సాగునీటి వసతులు పెరగడం, ప్రభుత్వం రైతుబంధు కింద అన్నదాతలకు ఆర్థిక సాయం చేయడంతో పరిస్థితి మరింత మెరుగుపడింది. దీంతో 2020-21లో రెండు సీజన్లలో వ్యవసాయ, ఉద్యాన పంటల స్థూల ఉత్పత్తి విలువ (ఖరీఫ్, రబీ సీజన్‌లలో కలిపి మొత్తం దిగుబడుల విలువ) ఏకంగా రూ.లక్ష కోట్లని ఉద్యానశాఖ తేల్చింది. 2019-20లో మొత్తం పంటల విలువ రూ.89,058 కోట్లని పేర్కొంది. ఏడాది కాలంలోనే అదనంగా పంటల ఉత్పత్తి విలువ రూ. 10,942 కోట్లు పెరగడం విశేషం. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి.. 2020–21లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2.09 కోట్ల ఎకరాలు కావడం గమనార్హం.

2014–15 వానాకాలం, యాసంగి కలిపి పంటల సాగు విస్తీర్ణం 1.40 కోట్ల ఎకరాలు. ఈ ఏడేళ్లలో సాగు విస్తీర్ణం ఏకంగా 69 లక్షల ఎకరాలు పెరిగింది. 2020–21 ఖరీఫ్‌లో 1.20 కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి ఉత్పత్తి కాగా, రబీలో దాదాపు 1.35 కోట్ల మెట్రిక్‌ టన్నులకు పైగా వస్తుందని అంచనా. ఈ యాసంగిలో 65.02 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. ఇది తెలంగాణలో ఆల్‌టైం రికార్డుగా వ్యవసాయశాఖ పేర్కొంది. యాసంగి వరిసాగు కూడా ఆల్‌టైం రికార్డు నమోదైనట్లు వెల్లడించింది. 50.49 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడినట్లు తెలిపింది. యాసంగిలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 22.19 లక్షల ఎకరాలు కాగా, గతేడాది యాసంగిలో 26.97 లక్షల ఎకరాల్లో సాగైంది. అదే ఇప్పటివరకు యాసంగి రికార్డు సాగు. కానీ ఈయేడు యాసంగిలో భారీగా వరి సాగై కొత్త రికార్డును నెలకొల్పింది. వరి సాగు విస్తీర్ణంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌గా నిలిచినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.50 లక్షల ఎకరాలు ఉండగా, దాన్ని దీర్ఘకాలికంగా 66లక్షల ఎకరాలకు విస్తరించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. అంటే 5 రెట్లకుపైనే ఉద్యాన పంటలను విస్తరించాలని భావిస్తోంది.

2027 నాటికి ఎగుమతి చేసే స్థాయికి ఆయిల్‌పాం
వంట నూనెలను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దీంతో విదేశీ మారకద్రవ్యం కరిగిపోవడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు నూనె ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆయిల్‌పాం సాగు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణలోనూ ఆయిల్‌పాం సాగుపై ఉద్యాన శాఖ దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఆయిల్‌ఫాం సాగు విస్తీర్ణం కేవలం 38 వేల ఎకరాలు మాత్రమే. దీంట్లో 2.08లక్షల మెట్రిక్‌ టన్నులే ఉత్పత్తి వస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలని.. 2026 నాటికి స్వయం సమృద్ధి సాధించాలని, 2027 నుంచి ఎగుమతులు చేసే స్థాయికి చేరుకోవా లని ఉద్యానశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలో స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 8.52 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేపట్టాలని నిర్ణయించింది. అందుకోసం ఆయిల్‌ఫెడ్‌ సహా వివిధ కంపెనీలకు సాగు ప్రాంతాలను అప్పగించింది. దీర్ఘకాలిక విస్తరణ కింద 15 లక్షల ఎకరాల్లో సాగు, 1.65 కోట్ల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకుంది.  

పండ్లు, కూరగాయల సాగు నాలుగున్నర రెట్లు
రాష్ట్రంలో పండ్లు, కూరగాయలు సమృద్ధిగా పండటం లేదు. టమాటా సహా అనేక కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నాం. పండ్లదీ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలంలో రాష్ట్రంలో పండ్లు, కూరగాయల సాగు విస్తీర్ణాన్ని నాలుగున్నర రెట్ల వరకు పెంచాలని ఉద్యానశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో పండ్ల సాగు విస్తీర్ణం 4.49 లక్షల ఎకరాలు కాగా, స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 5.13 లక్షల ఎకరాలకు, మధ్యకాలిక లక్ష్యంలో భాగంగా 10 లక్షల ఎకరాలు, దీర్ఘకాలిక విస్తరణలో భాగంగా 19.50 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఉల్లి సహా అన్ని రకాల కూరగాయల సాగు ప్రస్తుత విస్తీర్ణం 2.73 లక్షల ఎకరాలు కాగా, దీర్ఘకాలికంగా దీన్ని 12 లక్షల ఎకరాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇక సుగంధ ద్రవ్యాల ప్రస్తుత సాగు విస్తీర్ణం 3.73 లక్షల ఎకరాలు కాగా, దీర్ఘకాలికంగా 16 లక్షల ఎకరాలకు విస్తరించాలని భావిస్తున్నట్లు ఉద్యానశాఖ డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. అంటే మొత్తం ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం అదనంగా 53.50 లక్షల ఎకరాలు పెంచాలని దీర్ఘకాలిక లక్ష్యంగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ఉల్లి సాగు లక్ష్యం.. 3 లక్షల ఎకరాలు
ఉల్లి లొల్లి నుంచి బయటపడే దిశగా ఉద్యానశాఖ కసరత్తు ప్రారంభించింది. ఉల్లి కోసం మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాలపై ఆధారపడే పరిస్థితి ఇక ఉండకూడదని నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఉల్లి కొరత ఉంటే, ఇక్కడ ధరలు పెరగడం... ఫలితంగా వినియోగదారులు ఇబ్బందులు పడటం తెలిసిందే. దానికి కారణం రాష్ట్రంలో ఉల్లి విస్తీర్ణం పెద్దగా లేకపోవడమే. ప్రస్తుతం రాష్ట్రంలో 18 వేల ఎకరాల్లోనే ఉల్లి సాగవుతోంది. 1.82 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపులో భాగంగా స్వల్పకాలిక, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను ఉద్యానశాఖ నిర్దేశించుకుంది. ఆ ప్రకారం స్వల్పకాలిక విస్తరణలో భాగంగా 75 వేల ఎకరాలకు ఉల్లి సాగు విస్తీర్ణాన్ని పెంచడం ద్వారా 7.90 లక్షల టన్నుల దిగుబడి సాధించాలని నిర్ణయించింది. ఆపై లక్షన్నర ఎకరాలకు ఉల్లి సాగు పెంచి, ఉత్ప త్తిని 16.50 లక్షల టన్నులు చేయడం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక దీర్ఘకాలిక విస్తరణలో భాగంగా 3 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగు చేపట్టి, 35 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top